-న్యాయశాఖ మంత్రి ఫరూక్ కు విజ్ఞప్తి చేసిన సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడిషల్ మెజిస్ట్రేట్లు
-న్యాయవాదులకు రక్షణ చట్టం, ఆరోగ్య భీమా కల్పించాలని కోరిన ఐఎల్ఏ ప్రతినిధులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వివిధ న్యాయస్థానాల్లో స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ల (సెకండ్ క్లాస్) నియామకాలను రెండేళ్ల కాల వ్యవధితో చేపట్టాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను పలువురు స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ లు కోరారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ లో ఉన్న న్యాయ, మైనారిటీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో మంత్రి ఫరూక్ ను మేజిస్ట్రేట్ లు కలిశారు. ప్రస్తుతం ఒక ఏడాది వ్యవధితో జరుగుతున్న స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ల నియామకాల వల్ల కలుగుతున్న ఇబ్బందుల గురించి వారు మంత్రికి వివరించారు. నియామకాలలో, కేసుల నిర్వహణలో జాప్యాన్ని నివారించాలనే ఉద్దేశ్యంతో స్పెషల్ జుడీషియల్ మేజిస్ట్రేట్ల నియమిత కాలాన్ని ప్రస్తుత ఒక సంవత్సరవ్యవధి నుండి రెండు సంవత్సరాలకు పెంచేందుకు వీలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో అసెంబ్లీలో బిల్లు నంబర్ 18/2025 ని తీర్మానించి గౌరవ భారత రాష్ట్రపతి గారి ఆమోదం కోసం రిజర్వు చేయబడినదని త్వరలో ఈ బిల్లు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
మంత్రి దృష్టికి న్యాయవాదుల సమస్యలు
ఇండియన్ లాయర్స్ అసోసియేషన్(ఐఎల్ఏ )ప్రతినిధులు న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలిసి వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులందరికీ,వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉచితంగా సమగ్ర ఆరోగ్య బీమా కవరేజీని అందించాలని, నగదు రహిత ఆరోగ్య బీమా కార్డులను అందించాలని కోరారు.అర్హులైన జూనియర్ న్యాయవాదులందరికీ, వారు నమోదు చేసుకున్న తేదీ నుండి ఐదు సంవత్సరాల కాలానికి నెలకు రూ.10 వేలు ఆర్థిక సహాయం మంజూరు చేయాలని కోరారు. న్యాయవాదులు తమ వృత్తిపరమైన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు, దాడులు, బెదిరింపులకు గురవుతున్నారని ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు.న్యాయవాదులకు గృహ స్థలాల కేటాయింపు పై కూడా చర్యలు తీసుకోవాలని మంత్రి ఫరూక్ ను ఐఎల్ఏ ప్రతినిధులు కోరారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆక్ట్ రూపొందించే విషయంలో ఏపీ బార్ కౌన్సిల్ నుండి ప్రతిపాదనలు కోరడమైనదని, మిగతా విషయాలపై న్యాయశాఖ కార్యదర్శితో చర్చించి ప్రణాళిక బద్ధమైన చర్యలు తీసుకుంటామని న్యాయవాదులకు మంత్రి ఫరూక్ హామీ ఇచ్చారు
Prajavartha Online Telugu News