Breaking News

పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టాకు సిరులు

-2015 నుంచి ఇప్పటి వరకూ 450 టీఎంసీల తరలింపు
-పోలవరం లాంటి ప్రాజెక్టులపై గత పాలకుల నిర్లక్ష్యం దేశద్రోహం
-గోల్డెన్ క్వాడ్రిలేటరల్ లాగే నదుల అనుసంధానం జరగాలి
-వంశధార నుంచి పెన్నా వరకూ రివర్ లింకేజి లక్ష్యం
-ఎన్టీఆర్ జిల్లా పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలకు సీఎం జలహారతి
-కేఎల్ రావు 124వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టిసీమ ప్రాజెక్టు వల్లే కృష్ణా డెల్టాలో రైతులు సిరులు పండించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2015 నుంచి ఇప్పటి వరకూ పట్టి సీమ ప్రాజెక్టు నుంచి 450 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించినట్టు వెల్లడించారు. రూ.1300 కోట్లతో నిర్మించిన పట్టి సీమ డెల్టాతో పాటు రాష్ట్రంలో విలువైన సంపద సృష్టికి కారణమైందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలకు ముఖ్యమంత్రి జల హారతి ఇచ్చారు. సంప్రదాయ పంచె కట్టులో వచ్చిన ముఖ్యమంత్రి కృష్ణా- గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు- కుంకుమలు సమర్పించారు. అనంతరం ప్రముఖ ఇంజనీరు కేఎల్ రావు 124వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “సాగునీటి రంగానికి సేవలు అందించిన కేఎల్ రావుగారి 124 జయంతిని పురస్కరించుకుని ఇంజనీరుగా స్పూర్తిని ప్రతీ గ్రామానికీ తీసుకెళ్లేలా ఆయన ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పట్టి సీమ నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తున్నాయి. ఏడాదిలో పట్టి సీమ పూర్తి చేసి కృష్ణాడెల్టాను కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీది. 80 టీఎంసీలతో కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలను స్థిరీకరించాం. నాకు ఎక్కడ పేరు వస్తుందో అని నాడు పట్టి సీమ నిర్మిస్తుంటే కొందరు విమర్శించారు. పట్టి సీమ, ఒట్టిసీమ అన్నారు. విమర్శలు పట్టించుకుని ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేస్తే కృష్ణా డెల్టా ఏమయ్యేదో. విమర్శలు పట్టించుకోకుండా రూ.1300 కోట్లు ఖర్చు చేసి పట్టి సీమ పూర్తి చేశాం. గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీల వరద జలాలను తీసుకువచ్చాం. పట్టి సీమకు చేసిన ఖర్చుతో కృష్ణా డెల్టా మొత్తం స్థిరీకరణ జరిగింది. ఎకరాకు రూ.1200 ఖర్చు అవుతోంది. వనరులు వృధా కాకుండా రైతులకు మేలు చేయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. వచ్చే వరద జలాలను సముద్రానికి వదిలేసి ఇతర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవటం తెలివైన పని అనిపించుకోదు. పట్టి సీమ నీటితో కృష్ణా డెల్టాలో రైతులు బంగారం పండిస్తున్నారు. పోలవరం కుడి కాలువ నుంచి నీటి తరలింపు కారణంగానే శ్రీశైలంలో కృష్ణా నీటిని పొదుపు చేసి రాయలసీమకు నీరందింస్తున్నాం. రాష్ట్రంలో ప్రతీ ఎకరాకి సాగునీరు అందించాలన్నదే కూటమి ప్రజా ప్రభుత్వ లక్ష్యం” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ప్రాజెక్టులపై గత పాలకుల నిర్లక్ష్యం

2014-19 మధ్య రూ.68 వేల కోట్లు సాగునీటి రంగానికి ఖర్చు చేశాం. 2024 నుంచి రెండేళ్లలో రూ.24 వేల కోట్లు ఖర్చు పెట్టాం. గత పాలకులు అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పోయినా పట్టించుకోలేదు. గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకు పోయినా మాట్లాడలేదు. ప్రాజెక్టుల మరమ్మతులకు పైసా ఇవ్వలేదు, గ్రీజు కూడా పూయలేదు. తుంగభద్ర డ్యామ్ కు కొత్త గేట్లను ఏర్పాటు చేయించాం. నిన్న ధవళేశ్వరం బ్యారేజికి కూడా రూ.152 కోట్లుతో కొత్త గేట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించాం. 2014-19లో పోలవరం ప్రాజెక్టులో 72 శాతం పనులు పూర్తి చేశాం. గడచిన రెండేళ్లలో ప్రాజెక్టును 89 శాతం మేర పూర్తి చేశాం. కానీ 2019-24 మధ్య కనీసం 2 శాతం కూడా పనులు చేయలేదు. పూర్తి నిర్లక్ష్యంతో డయాఫ్రామ్ వాల్ కూడా కొట్టుకు పోయేలా చేశారు. అతి ముఖ్యమైన ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చేయటం దేశ ద్రోహం, రాష్ట్ర ద్రోహం. ప్రాజెక్టులను గాలికి వదిలేసిన గత పాలకులు రాష్ట్ర రైతులకు ద్రోహం చేశారు. ఇప్పుడు అమరావతిని కూడా అద్బుతమైన నగరంగా నిర్మిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారు. ప్రతిపక్షంలోని కొందరు రైతుల్ని రెచ్చగొట్టి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

సాగునీటికి ఎక్కువ నిధులు

వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలో నదులు అనుసంధానం జరగాలన్నదే నా ఆకాంక్ష. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలో నదులు అనుసంధానమైతే భారత్ దేశానికి తిరుగు ఉండదు. సముద్రంలోకి వెళ్లే నీటిని సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతుంది. ప్రాధాన్యతా క్రమంలో 36 ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో పూర్తి చేస్తాం.ఈ ఏడాది జూన్ లో తుంగభద్ర ప్రాజెక్టు కు కొత్త గేట్లు ఏర్పాటు చేసి ప్రారంభించాం. కాటన్ బ్యారేజికి కూడా కొత్త గేట్ల పనులు ప్రారంభించాం. వచ్చే ఏడాదికి ఈ పనులు పూర్తి అవుతాయి. గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులకు కూడా ఈ నెలలోనే శంకుస్థాపన చేసి రెండేళ్లలో పూర్తి చేస్తాం. పోలవరం ఎడమ కాలువ పూర్తి అయ్యింది. ఆగస్టు 14 తేదీన గోదావరి జలాలకు అనకాపల్లి వద్ద స్వాగతం పలుకుతాం. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ను 2026 సెప్టెంబరు 1 తేదీన జాతికి అంకితం చేస్తాం. ఈ ప్రాజెక్టులో రూ.4 వేల కోట్ల పనులు పెండింగ్ లో ఉన్నా గత పాలకులు ప్రాజెక్టు ప్రారంభించామని నాటకాలు ఆడారు. సొరంగంలో టన్నెల్ బోరింగ్ యంత్రం ఇరుక్కు పోయి ఉన్నా జాతికి అంకితం అన్నారు. గత పాలకులు చేసిన మోసాన్ని కూడా ప్రజలకు చెబుతాం. రాష్ట్రంలో కురిసే ప్రతీ వర్షపు చుక్కనూ భూగర్భ జలంగా మార్చుకోవాల్సి ఉంది. జలధార కింద ఈ పనులు పెద్ద ఎత్తున చేపట్టాం. రాష్ట్ర భవిష్యత్తుకు విరోధంగా పనిచేసే వారి పట్ల మనం అంతా అప్రమత్తంగా ఉండాలి. ” అని ముఖ్యమంత్రి అన్నారు.

సాగునీటి రంగంలో కేఎల్ రావుది ఎనలేని కృషి

శ్రీశైలం, నాగార్జున సాగర్, హీరాకుడ్, కోసీ లాంటి ప్రధానమైన డ్యామ్ ల నిర్మాణంలో కేఎల్ రావు కీలక పాత్ర పోషించారు. ఐక్యరాజ్య సమితి తరపున అంతర్జాతీయ జల నిపుణులుగా ఈజిప్ట్, సూడాన్ లాంటి దేశాల్లోనూ సేవలందించారు. విజయవాడలో జన్మించి ఎంపీగా ఎన్నికై ముగ్గురు ప్రధానుల వద్ద కేంద్ర మంత్రిగా పనిచేశారు. నీటి పారుదల రంగం, జల విద్యుత్ ఉత్పత్తి లాంటి అంశాలపై పనిచేసి దేశానికి సేవలందించారు. శివ రామకృష్ణయ్య, కేఎల్ రావుల తర్వాత ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంపై ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్. సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దటంలో వీరంతా నాకు ఎంతో స్పూర్తి. జలధార కార్యక్రమంతో భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోకుండా చర్యలు చేపట్టాం. అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ సహా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

వచ్చే 3 ఏళ్లలో ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసే 36 సాగునీటి ప్రాజెక్టుల వివరాలు

1 తుంగభద్ర కొత్త గేట్లు 25-06-2026 ప్రారంభోత్సవం పూర్తి
2 కాటన్ బ్యారేజ్ గేట్లు 13-07-2026 శంకుస్థాపన పూర్తి
3 గుంటూరు ఛానల్ ఆధునీకరణ 31-07-2026 శంకుస్థాపన
4 పోలవరం ఎడమ ప్రధాన కాలువ 14-08-2026 ప్రారంభోత్సవం
5 పెరూరు బ్రాంచ్ కెనాల్ – ప్యాకేజీ 36A 04-08-2026 శంకుస్థాపన
6 వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్ – 1 01-09-2026 ప్రారంభోత్సవం
7 పాలేరు రిజర్వాయర్ 10-09-2026 శంకుస్థాపన
8a హెచ్.ఎన్.ఎస్.ఎస్. ఫేజ్-2 (400 – 490 కి.మీ) 31-10-2026 ప్రారంభోత్సవం
b హెచ్.ఎన్.ఎస్.ఎస్. ఫేజ్-2 (490 – 554 కి.మీ, అడవిపల్లి వరకు) 30-06-2027 ప్రారంభోత్సవం
9 నెరడి బ్యారేజ్ 30-11-2026 శంకుస్థాపన
10 పెన్నా-సర్వేపల్లి రిజర్వాయర్ 31-12-2026 ప్రారంభోత్సవం
11 మడ్డువలస స్టేజ్-2 31-01-2027 ప్రారంభోత్సవం
12 జంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్ 31-01-2027 ప్రారంభోత్సవం
13 పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ 31-03-2027 ప్రారంభోత్సవం
14 హీరమండలం ఎత్తిపోతల పథకం 30-04-2027 ప్రారంభోత్సవం
15 నీవా బ్రాంచ్ కెనాల్ (నీవా నది వరకు) 30-06-2027 ప్రారంభోత్సవం
16 నాగావళి – చంపావతి నదుల అనుసంధానం 30-06-2027 ప్రారంభోత్సవం
17a బుడమేరు (ఎనికేపాడు యూటీ) 30-06-2027 ప్రారంభోత్సవం
17b బుడమేరు డైవర్షన్ ఛానల్ (బి.డి.సి) 30-06-2027 ప్రారంభోత్సవం
18 ముక్త్యాల ఎత్తిపోతల పథకం 30-06-2027 ప్రారంభోత్సవం
19 వంశధార ఫేజ్-2, స్టేజ్-2 01-07-2027 ప్రారంభోత్సవం
20 చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్-1 31-07-2027 ప్రారంభోత్సవం
21 మహేంద్రతనయ ఆఫ్-షోర్ రిజర్వాయర్ 15-07-2027 ప్రారంభోత్సవం
22 గజపతినగరం బ్రాంచ్ కెనాల్ 31-07-2027 ప్రారంభోత్సవం
23 తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ 20-07-2027 ప్రారంభోత్సవం
24 a అల్తూరుపాడు ఎత్తిపోతల 30-09-2027 ప్రారంభోత్సవం
b అల్తూరుపాడు రిజర్వాయర్ 30-09-2027 ప్రారంభోత్సవం
c అల్తూరుపాడు నుండి మెర్లపాక వరకు ఎస్.ఎస్.ఎల్.సి 30-09-2027 ప్రారంభోత్సవం
d మల్లెమడుగు ఎత్తిపోతల 30-09-2027 ప్రారంభోత్సవం
e మల్లెమడుగు రిజర్వాయర్ 31-12-2027 ప్రారంభోత్సవం
f బాలాజీ రిజర్వాయర్ 31-03-2028 ప్రారంభోత్సవం
25 కళ్యాణి డ్యామ్ కోసం ములపల్లి ఎత్తిపోతల పథకం 15-12-2027 ప్రారంభోత్సవం
26 మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ 31-12-2027 ప్రారంభోత్సవం
27 తారక రామ తీర్థసాగరం ప్రాజెక్ట్ 30-12-2027 ప్రారంభోత్సవం
28 వేదవతి ఎత్తిపోతల పథకం 30-06-2028 ప్రారంభోత్సవం
29 భైరవానితిప్ప ఎత్తిపోతల పథకం 30-06-2028 ప్రారంభోత్సవం
30 అప్పర్ పెన్నా ప్రాజెక్ట్ 30-06-2028 ప్రారంభోత్సవం
31 కడప నగరం వరకు జి.ఎన్.ఎస్.ఎస్ 30-06-2028 ప్రారంభోత్సవం
32 గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునీకరణ 30-06-2028 ప్రారంభోత్సవం
33 వరికుడిసేల ప్రాజెక్ట్ 15-12-2028 ప్రారంభోత్సవం
34 ఎస్.ఆర్.ఎం.సి మరియు ఎస్.ఆర్.బి.సి అప్‌గ్రేడేషన్ 31-12-2028 ప్రారంభోత్సవం
35 జి.ఎన్.ఎస్.ఎస్ కడప నుండి కొడూరు వరకు 31-12-2028 ప్రారంభోత్సవం
36 జి.ఎన్.ఎస్.ఎస్ కొడూరు – మల్లెమడుగు – బాలాజీ రిజర్వాయర్ 31-12-2028 ప్రారంభోత్సవం

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *