Breaking News

సమ్మిళిత పట్టణాభివృద్ధిపై ఏపీ ఎంఓయూ

-యూఎన్ హ్యాబిటాట్ తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం
-సీఎం చంద్రబాబు- యూన్ హ్యాబిటాట్ ఈడీ సమక్షంలో ఎంఓయూ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సమ్మిళిత పట్టణాభివృద్ధిని ప్రోత్సహించేలా ఏపీ ప్రభుత్వం- ఐక్యరాజ్య సమితికి చెందిన యూఎన్ హ్యాబిటాట్ మధ్య కీలకమైన అవగాహనా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, యూఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనక్లాడియా రోస్బాక్ ల సమక్షంలో ఈ వ్యూహాత్మక ఒప్పందాన్ని ఏపీ పురపాలక శాఖ-యూఎన్ హ్యాబిటాట్ సంస్థలు కుదుర్చుకున్నాయి. ఆమె సింగపూర్ నుంచి వర్చువల్ గా ఈ ఎంఓయూ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్జ్ ఏపీ, రైజ్ ఏపీ, అప్ లిఫ్ట్ ఏపీ విధానాల్లో భాగంగా అమరావతిలో పట్టణ వ్యవహారాలపై ఓ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు పేదరిక నిర్మూలన, పట్టణ పేదల జీవనోపాధిని మెరుగుపరచటం లాంటి అంశాలను చేపట్టేలా ఈ ఒప్పందం చేసుకున్నారు. ప్రాంతీయ ఆర్ధిక వృద్ధి కోసం వ్యూహాత్మక పట్టణ ప్రణాళిక, వాతావరణ మార్పులను తట్టుకునేలా సుస్థిర పర్యావరణ వ్యవస్థల నిర్మాణం, డిజిటల్ గవర్నెన్సు, మున్సిపల్ ఫైనాన్స్ తో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఏపీ ప్రభుత్వం- యూఎన్ హ్యాబిటాట్ తో కలిసి పనిచేయనుంది. దీంతో పాటు 2028లో మెక్సికోలో జరుగనున్న 14వ వరల్డ్ అర్బన్ ఫోరమ్ సదస్సులో ఏపీ విజయాలను ప్రపంచవేదికపై ప్రదర్శించాలని నిర్ణయించారు.

అమరావతిలో గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్

అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రీన్ ఫీల్డ్ నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. సర్జ్ ఏపీ, రైజ్ ఎపీ, అప్ లిఫ్ట్ ఏపీ సహా పట్టణ పేదరిక నిర్మూలనపై యూఎన్ హ్యాబిటాట్ తో కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మకం అవుతుందని సీఎం అన్నారు. జీరో పావర్టీ పై ఓ రోడ్ మ్యాప్ నిర్దేశించుకుని ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం అన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు పీ4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని యూఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కు సీఎం వివరించారు. అర్బన్ ప్లానింగ్ సహా ఆర్థికాభివృద్ధి పై మంత్లీ ఎకనామిక్ రిపోర్టుల ద్వారా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నట్టు తెలిపారు. బయోడైవర్సిటీని సంరక్షించేలా గ్రీన్ ఎనర్జీ విద్యుత్ ఉత్పత్తి కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామన్నారు. అర్బన్ ప్లానింగ్, లివబిలిటి, డిజిటల్ గవర్నెన్సులో ఏపీ అగ్రస్థానంలో ఉందని సీఎం వివరించారు. డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. బెస్ట్ ప్రాక్టీసెస్ బ్రాండ్ అంబాసిడర్ గా తాను వ్యవహరిస్తానని సీఎం అన్నారు. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణం సీఎం చంద్రబాబు విజన్ కు ప్రతిరూపంగా ఉందని, ఏపీ -యూఎన్ హ్యాబిటాట్ మధ్య కుదిరిన ఒప్పందం చారిత్రాత్మకమని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనక్లాడియా రోస్బాక్ వ్యాఖ్యానించారు. వ్యర్ధాల నిర్వహణ, వాయు కాలుష్య నియంత్రణ, బహిరంగ ప్రదేశాల అభివృద్ధి తదితర అంశాలపై ఏపీతో కలిసి పనిచేస్తామని అన్నారు. 2036 నాటికి పునరుత్పాదక ఇంధన రంగంలోనూ సమూల మార్పులు వచ్చేలా ఒప్పందం సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *