-జెడ్పీ ఆస్తులను ఆదాయ వనరులుగా అభివృద్ధి చేస్తాం – జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయడంతో పాటు, జెడ్పీ ఆస్తులను ఆదాయ వనరులుగా తీర్చిదిద్దే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక పేర్కొన్నారు.
జిల్లా ప్రజా పరిషత్ 1వ స్థాయి సంఘం (ప్లానింగ్, ఆర్థికం), 7వ స్థాయి సంఘం (పనులు) సమావేశాలు గురువారం మచిలీపట్నంలోని జిల్లా ప్రజా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జరిగాయి.
ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ, జిల్లా పరిషత్ అభివృద్ధి పనులకు సంబంధించిన పరిపాలనా అనుమతుల మంజూరు, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటికే ఆమోదం పొందిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి, ప్రస్తుత పదవీకాలం ముగిసేలోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జడ్పీటీసీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.
జిల్లా పరిషత్ సమావేశ మందిరం ఆధునీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఈ నెల 24 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం నూతన సమావేశ మందిరాన్ని ప్రారంభించి, వచ్చే సాధారణ సర్వసభ్య సమావేశాన్ని అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కొత్త సమావేశ మందిరం, ఛాంబర్ ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయని చెప్పారు.
జిల్లా పరిషత్‌కు చెందిన భూములను గుర్తించి వాటిని ఆదాయ వనరులుగా మార్చే దిశగా చర్యలు చేపడుతున్నామని చైర్పర్సన్ తెలిపారు. కొబ్బరి, కోకో, జీడిమామిడి, క్యాజూరినా వంటి వాణిజ్య పంటల సాగు ద్వారా ఆదాయం పెరగడంతో పాటు భూముల ఆక్రమణలను కూడా నివారించవచ్చని సూచించారు. అన్ని జెడ్పీ ఆస్తులకు అసెట్ రిజిస్టర్ నిర్వహించి, వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తకుండా సంతృప్త స్థాయిలో (సాచ్యురేషన్ మోడ్) తాగునీటి సరఫరా కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో నాణ్యమైన తాగునీరు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) డాక్టర్ జే అరుణ మాట్లాడుతూ, స్థాయి సంఘ సమావేశాలు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను రూపొందించుకునే సమర్థవంతమైన వేదిక అని అన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంపొందించి ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థాయి సంఘాల ఆమోదంతో తీసుకున్న అంశాలను తదుపరి సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆమోదానికి ఉంచనున్నట్లు తెలిపారు.
సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ డిప్యూటీ సీఈఓ డాక్టర్ ఆనంద్ కుమార్, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు, జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News