-సోనం వాంగ్ చుక్ కు సంఘీభావంగా పార్టీ శ్రేణులు కార్యక్రమాలు చేపట్టండి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ వేత్త, రామ్ మెగసెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్ చుక్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సంఘీభావం ప్రకటించారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పర్యావరణవేత్త, రామ్ మెగసెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్ చుక్ గత నెల ఆఖరి నుండి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. సోనం వాంగ్ చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం విచారకరం. మోడీ సర్కార్ పాలన కేవలం కార్పొరేట్లకు అనుకూలంగా సాగుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ లక్షలాదిమంది విద్యార్థుల్లో నిరాశను నింపింది. పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నప్పటికీ ప్రధాని మోడీ పట్టించుకోకపోవడం క్షంతవ్యం కాదు.
ప్రముఖ సైంటిస్టుగా, ఉపాధ్యాయునిగా సోనం వాంగ్ చుక్ ఎంతో కీర్తి గడించారు. లడక్ ప్రాంతంలో తాగేందుకు మంచినీళ్లు లేని పరిస్థితుల్లో మంచు పర్వతాలను కరిగించి నీళ్లుగా మార్చారు. సియాచిన్ ఏరియాలో మైనస్ డిగ్రీలలో ఉండే చలి తీవ్రతను తట్టుకునేలా సైనికులకు వేడి కల్పించే పరికరాలను తయారు చేశారు. ఇండియా సరిహద్దుల్లో చొరబాట్లను వ్యతిరేకించి, పలు పర్యావరణహిత కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ఇప్పుడు దేశం కోసం, న్యాయం కోసం, విద్యార్థుల కోసం నిరవధిక దీక్ష చేస్తున్నారు. పాశవిక నరేంద్ర మోడీ ప్రభుత్వం సోనం వాంగ్ చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కర్కశంగా వ్యవహరిస్తున్నది. మోడీ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సోనం వాంగ్ చుక్ కు ఏదైనా జరిగితే ప్రధాని మోడీనే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి సోనం వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితిని గమనించి, తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. సోనం వాంగ్ చుక్ కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంఘీభావ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News