న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక భారత్ టెక్స్–2026 ఎక్స్‌పోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర BC సంక్షేమం, జౌళి శాఖ మంత్రి సవితమ్మ మరియు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ మరియు లేపాక్షి హస్తకళల ఎక్స్పో స్టాల్స్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ప్రముఖ టెక్స్టైల్ బయ్యర్ సంస్థ Julie & Co ప్రతినిధులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో తయారవుతున్న హ్యాండ్లూమ్, టెక్స్టైల్ మరియు హస్తకళ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న అవకాశాలు, ఎగుమతుల విస్తరణ, నాణ్యత ప్రమాణాలు, కొనుగోలు భాగస్వామ్యాలపై విస్తృతంగా చర్చించారు.
అనంతరం భారత్ టెక్స్–2026 చైర్మన్ నరేన్ గోయంక మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ తో సమావేశమై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళలు, చేనేత ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు మరింత చేరువ చేయడం, రాష్ట్ర కళాకారులు, నేతన్నలకు మార్కెట్ అనుసంధానం కల్పించడం, ఎగుమతుల అవకాశాలను పెంపొందించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలోని చేనేత, జౌళి మరియు హస్తకళ రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఇలాంటి అంతర్జాతీయ వేదికలు రాష్ట్ర ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, లేపాక్షి బ్రాండ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో మరింత మార్కెట్‌ను విస్తరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, కళాకారుల ఉత్పత్తులను ప్రపంచ వినియోగదారులకు చేరవేసే దిశగా పలు వ్యూహాత్మక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News