గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో బోర్డ్ లు ఏర్పాటు చేసి, వాటి అభివృద్ధికి ప్రాంతాల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ నగరంలోని కృష్ణనగర్, కుందులరోడ్, నల్లపాడు, శ్యామల నగర్, విద్యా నగర్, గోరంట్ల తదితర ప్రాంతాల్లో పర్యటించి జిఎంసి ఖాళీ స్థలాలు, అభివృద్ధి పనులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని జిఎంసి స్థలాలు అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, స్థలాల్లో జిఎంసి బోర్డ్ లు ఏర్పాటు చేయాలన్నారు. కోర్ట్ కేసులు నమోదు అయిన వాటికి నిర్దేశిత డాక్యుమెంట్స్, తగిన ఆధారాలతో కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. ఏ ఒక్క స్థలం అన్యాక్రాంతం కావడానికి వీలు లేదని, పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం నల్లపాడు మెయిన్ రోడ్, రైల్వే స్టేషన్ కి వెళ్లే రోడ్ ని పరిశీలించి, డ్రైన్ నిర్మాణ పనులను వేగంగా చేయాలని, నిర్మాణ వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. ఆక్యూపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన నిబందనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాల నిర్మాణాలు జరగాలని, భవనాల నిర్మాణ దశలోనే వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిర్మాణాలను నిరంతరం పరిశీలిస్తూ, నిబందనల మేరకు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి, నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. భవన నిర్మాణదారులు నిర్మాణాలకు సంబంధించిన నిర్మాణ సామగ్రి రోడ్ల పై వేయకుండా చూడాలని, అలాగే సి అండ్ డి వేస్ట్ ఉంటె వెంటనే తొలగించాలన్నారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, సిటీ ప్లానర్ రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్, ఏసిపీ రెహ్మాన్, ఈఈ విష్ణు, డిఈఈలు శ్రీనివాస్, వెంకటరమణ, సర్వేయర్ లక్ష్మీనారాయణ, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News