విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ఈరోజు RTC ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (RTC JAC) నాయకులు ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, RTC ఉద్యోగ సంఘాల JAC ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన న్యాయమైన డిమాండ్లకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యుత్ వాహనాల (EV) విధానాన్ని అనుసరించడం అవసరమేనని, అయితే కొత్తగా ప్రవేశపెట్టే RTC ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న RTC డ్రైవర్లు, కండక్టర్లనే కొనసాగించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
అనుభవజ్ఞులైన RTC డ్రైవర్లు, కండక్టర్లు ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చగల సామర్థ్యం కలిగి ఉన్నారని, వారి సేవలను కొనసాగించడం వల్ల ఉద్యోగులకు భరోసా కలగడంతో పాటు ప్రయాణికుల భద్రత కూడా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
RTC ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించే అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తామని బొండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు.
ఎప్పటిలాగే విద్యుత్ బస్సుల నిర్వహణలో RTC ఉద్యోగుల సేవలు కొనసాగేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News