-జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో (హాస్టళ్లలో) నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు, నగర అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వర రావు డిమాండ్ చేసారు. గురువారం ధర్నా చౌక్ లో జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ వసతి గృహాల అవసరాలు, మెస్ చార్జీలు, కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వీరితో పాటు, జేఏసీ నాయకులు మాట్లాడుతూ బీసీల ఓట్లతో గెలిచిన ఈ కూటమి ప్రభుత్వం హాస్టళ్ల దుస్థితిపై దృష్టి సారించకపోవడం బాధాకరం అన్నారు. ఈ సమస్యలపై త్వరలోనే ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు బీసీ, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులకు వినతిపత్రం అందజేస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే గ్రామా గ్రామాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం 2023లో నిర్ణయించిన మెస్ చార్జీలనే ఇప్పటికీ కొనసాగించడం అన్యాయమన్నారు. మూడేళ్లలో ధరలు నాలుగు రెట్లు పెరిగినా చార్జీలు పెంచకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటీవలే బడ్జెట్లో మెస్ చార్జీలు 10% పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అది ఏమాత్రం సరిపోదని, కనీసం 25 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చే విద్యార్థులకు నెలకు కేవలం రూ.1600 మాత్రమే మెస్ చార్జీలుగా ఇవ్వడం దారుణమన్నారు. రోజుకు కనీసం రూ.50-60 కూడా పడని ఈ అరకొర నిధులతో విద్యార్థులు ఎలా బతకాలని ప్రశ్నించారు. బీసీల ఓట్లతో గెలిచిన ఈ కూటమి ప్రభుత్వం హాస్టళ్ల దుస్థితిపై, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, కొలనుకొండ శివాజీ, బిజెపి స్టేట్ ఓబిసి నాయకులు చంద్రశేఖర్, టి. పద్మ యాదవ్, కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News