విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇస్కాన్ విజయవాడ వారు “శ్రీ జగన్నాథ రథయాత్ర”ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. భవానిపురం సితార గ్రౌండ్స్ నుండి మధ్యాహ్నం 1 గంటకు పూజా కార్యక్రమం అనంతరం 3 గంటలకు రథయాత్ర వేలాది మంది భక్తులు మరియు కళాకారుల బృందాలతోనూ ఇతర రాష్ట్రాల మరియు దేశ విదేశీయ భక్తులతోనూ, స్వాతి థియేటర్ రోడ్డు, కనకదుర్గ గుడి రోడ్డు, రథం సెంటర్ మీదగా సీతమ్మ వారి పాదాలు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుండిచా మందిరం వద్దకు చేరుకుంది.
చిన్నారుల జగన్నాధ స్వామి ప్రీత్యర్థం చేసిన నృత్యాలు అందర్నీ ఎంతో ముగ్ధల్ని చేసాయి
సుమారు 6 కి.మీ 5 గంటల రథయాత్ర, వేలాదిమంది భక్తులతోనూ, విద్యార్థులతోనూ జగన్నాథుడు బలబద్రుడు సుభద్ర దేవి వేంచేసి ఉన్న రథము కన్నుల విందుగా పురవీధుల్లో నడుస్తుండగా భక్తులు రోడ్లమీద రంగవల్లులతోనూ, ముగ్గులతోనూ స్వామివారిని ఆహ్వానిస్తూ వీధులను అలంకరించారు. రథం కొనసాగినంతసేపు నగర ప్రముఖులు మరియు భక్తులు చీపురులతో వీధులను తుడుస్తూ, పూలు జల్లుతూ భగవంతుని స్వాగతించారు. భక్తులు భక్తి పారావశ్యముతో హరినామ సంకీర్తన చేస్తూనే వున్నారు.
తమ షాపుల ముందు మరియు గృహాల ముందు వచ్చిన జగన్నాథ్ స్వామి కి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. రథం ప్రారంభం నుంచి చివరి వరకు జగన్నాథ స్వామి ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. విజయవాడ పురవాసులకు ఈ రథయాత్ర పూరి రథయాత్రను తలపించినది.
ఈ జగన్నాథ్ రధయాత్రలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, బిజెపి స్పోర్ట్స్ పర్సన్ పాతూరు నాగభూషణం, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, నగర ప్రముఖులు పాల్గొన్నారు.
రధ పూజ తరువాత వారు హారతి ఇచ్చి భగవంతుడు ముందు చేరాపహరాను (జగన్నాథ స్వామి రథం ముందు బంగారు చీపిరితో ఊడవడం) చేశారు. ఈ ఉత్సవానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి మరియు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇస్కాన్ మందిర అధ్యక్షులు శ్రీమన్ చక్రధారి దాస్ కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News