-“టిండాల్ కం డ్రైవర్” కోర్సు కు దరఖాస్తుల ఆహ్వానం
-రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ప్రిన్సిపాల్ ఎస్. అంజలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక సాంకేతిక పద్ధతులతో యంత్రపు నావలు, బోటులలో చేపల వేట సాగించేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక “టిండాల్ కం డ్రైవర్” శిక్షణ కోర్సు (75వ బ్యాచ్)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు మత్స్య శాఖ అదనపు సంచాలకులు మరియు రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ప్రిన్సిపాల్ ఎస్. అంజలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుండి (01.09.2026) ప్రారంభం కానున్న ఈ ఉచిత శిక్షణ కోర్సు కాల వ్యవధి ఒక సంవత్సరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన అర్హులైన అభ్యర్థులు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను, సంబంధిత సర్టిఫికేట్ల నకళ్ళను జతపరిచి ఆగస్టు 10వ తేదీ (10.08.2026) సాయంత్రం 5.00 గంటల లోపు సంబంధిత జిల్లాల మత్స్య శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని లేదా కాకినాడలోని సంస్థ కార్యాలయానికి పోస్ట్ ద్వారా పంపాలని సూచించారు.
దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 20వ తేదీ ఉదయం 10.00 గంటలకు కాకినాడ, జగన్నాధపురంలోని “రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ” కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని, అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరుకావాలని స్పష్టం చేశారు.
దరఖాస్తు నమూనా మరియు పూర్తి వివరాలు www.fisheries.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు.
చేపల వేట రంగంలో నైపుణ్యం సాధించాలనుకునే అర్హులైన యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ప్రిన్సిపాల్ ఎస్. అంజలి ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News