అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల్లో స్పష్టమైన అల్పపీడనంగా (Well Marked Low Pressure ) కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీనితో పాటుగా కోస్తాంధ్ర, తెలంగాణ మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రేపు మేఘవృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం(17-07-2026) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు.
Prajavartha Online Telugu News