Breaking News

పలమనేరు సమీపంలో ప్రజల్ని భయభ్రాంతులకి గురిచేస్తున్న అడవి ఏనుగు పట్టివేత

-ఏనుగును పట్టుకునేందుకు నెల రోజులపాటు ప్రత్యేక ఆపరేషన్
-ఆపరేషన్ కోసం అధునాతన డ్రోన్లు, థర్మల్ సెన్సర్ కెమెరాల వినియోగం
-తుది అంకంలో పాల్గొన్న ఐదు కుంకీ ఏనుగులు, అటవీ సిబ్బంది, పశువైద్య నిపుణులు
-గతంలో అటవీ సెక్షన్ అధికారి సుకుమార్ పై దాడి చేసి గాయపర్చిన ఏనుగు
-గాయాల నుంచి కోలుకుని ఆపరేషన్ లో పాల్గొన్న సుకుమార్
-ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన అటవీ సిబ్బిందికి పవన్ కళ్యాణ్ అభినందనలు
-సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ ధైర్యాన్ని మెచ్చుకున్న ఉప ముఖ్యమంత్రి
-ఏనుగును కుంకీగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సూచన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత కొంత కాలంగా పలమనేరు పరిసరాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తూ, సమీప గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒంటరి మగ అడవి ఏనుగును ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ విజయవంతంగా బంధించింది. ఈ ఏనుగును బంధించేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు క్షేత్ర స్థాయి సిబ్బంది నెల రోజులకుపైగా చెమటోడ్చాల్సి వచ్చింది. సుమారు 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన ఈ ఏనుగును వన్యప్రాణి సంరక్షణ చట్టాలకు లోబడి, పశు వైద్య నిపుణులు, అటవీశాఖ ఫీల్డ్ సిబ్బంది పర్యవేక్షణలో బంధించారు. బుధవారం నిర్వహించిన తుది ఆపరేషన్లో ముసలమడుగు క్యాంపు నుంచి వచ్చిన ఐదు కుంకీ ఏనుగులు కూడా పాల్గొని, ఏనుగుని బంధించడంలో కీలకపాత్ర పోషించాయి. గతంలో ఈ ఏనుగు దాడిలో గాయపడిన అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొనడం గమనార్హం. అత్యంత చాకచక్యంగా ఆపరేషన్ నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసిన పీసీసీఎఫ్ పి.వి.చలపతిరావు, అటవీశాఖ సిబ్బందిని, అనంతపురం సర్కిల్ కన్జర్వేటర్ యశోదా బాయ్, చిత్తూరు జిల్లా అటవీ అధికారితో పాటు పశువైద్య నిపుణులు, ట్రాకర్లు, మహౌత్ లను రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి  పవన్ కళ్యాణ్ అభినందించారు. గతంలో ఏనుగు దాడిలో గాయపడినప్పటికీ, కోలుకుని ఈ ఆపరేషన్లో పాల్గొన్న సుకుమార్ ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. ప్రజల భద్రత, వన్యప్రాణి సంరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అటవీశాఖ చేపట్టిన ఆపరేషన్ ను ప్రశంసించారు. పట్టుకున్న ఈ ఏనుగును ముసలమడుగు క్యాంపుకి తరలిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలుపగా, కుంకీగా శిక్షణ ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ఈ ఏనుగు పలమనేరు సమీప ప్రాంతాల్లో సంచరిస్తూ పదే పదే పంటలను ధ్వంసం చేయడంతోపాటు పరిసర గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. పలుమార్లు జనావాసాల మధ్యకు రాగా, గతంలో చేపట్టిన మళ్లింపు చర్యల్లో పలమనేరు అటవీ విభాగానికి చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్  సుకుమార్ పై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చింది. పంటలకు నష్టం కలిగించడం, ప్రజల భద్రత దృష్ట్యా ఈ ఒంటరి మగ ఏనుగును బంధించాల్సి వచ్చింది. అందుకోసం సుదీర్ఘకాలం ఏనుగు కదలికలను క్షేత్ర స్థాయి అటవీ సిబ్బంది, ట్రాకర్ల సాయంతో పర్యవేక్షించారు. అప్పట్లో అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసినా తర్వాత ఏనుగు ప్రవర్తనలో మార్పు రావడాన్ని గుర్తించారు. అధునాతన డ్రోన్లు, థర్మల్ సెన్సార్ కెమెరాల సాయంతో నెల రోజులుగా ఏనుగు కదలికలను ట్రాక్ చేశారు. గతంలో ఏనుగు దాడి చేసిన సెక్షన్ లోనే జాతీయ రహదారికి సమీపంలో పట్టుకున్నారు.
వన్యప్రాణి నిర్వహణ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పీసీసీఎఫ్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఏనుగుకు మత్తుమందు ఇచ్చే ప్రక్రియను డాక్టర్ నవీన్, అరుణ్ లు సమన్వయం చేయగా, విశ్రాంత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రఘునాథ్ ఆపరేషన్ అనంతర కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించారు. అనంత సర్కిల్ కన్జర్వేటర్ ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షిస్తూ కీలక సూచనలు ఇచ్చారు. ఉపముఖ్యమంత్రివర్యుల సూచన మేరకు పట్టుకున్న ఏనుగును ముసలమడుగు కుంకీ శిబిరానికి తరలించారు. అక్కడ పశువైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, ఏనుగు ప్రవర్తనను కొంతకాలం పర్యవేక్షిస్తారు. మనుషులతో మెలిగే అంశంలో సానుకూల దృక్పథం కనబరిస్తే ప్రత్యేక శిక్షణ ఇచ్చి కుంకీగా తీర్చిదిద్దుతారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *