విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం గిరిపురం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు దోమల నివారణపై సూచనలు అందించారు.
ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ మాట్లాడుతూ నగరంలో దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ శాస్త్రీయ పద్ధతుల్లో విస్తృత చర్యలు చేపడుతోందన్నారు. ప్రధాన కాలువల్లో పూడిక తొలగింపు చేపట్టి ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా నిరంతర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ట్రాక్టర్ ఆధారిత ప్రత్యేక యంత్రాలు, బోట్ల సహాయంతో కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్కలు, చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను తొలగిస్తున్నామని చెప్పారు.
సిబ్బంది చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేసి దోమల లార్వా పెరగకుండా నివారణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిరంతరం ఫాగింగ్, యాంటీ లార్వల్ స్ప్రేయింగ్ నిర్వహించడంతో పాటు, దోమల లార్వాను ఆహారంగా తీసుకునే గాంబూసియా చేపలను నీటి వనరుల్లో విడిచిపెట్టి జీవసంబంధిత పద్ధతులను కూడా అమలు చేస్తున్నామని వివరించారు.
నగరపాలక సంస్థ చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో వారానికి ఒకరోజు, ముఖ్యంగా ప్రతి శుక్రవారం ‘డ్రై డే’గా పాటించి, ఇంటి లోపల, బయట, డాబాపై మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.
వాడుకలో లేని బకెట్లు, మగ్గులు, తొట్లు, డ్రమ్ములు, పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, టైర్లు, కూలర్లు, ఫ్రిజ్ ట్రేలు, నీటి నిల్వ ఉండే ఇతర పాత్రలను ప్రతి శుక్రవారం తప్పనిసరిగా పరిశీలించి వాటిలోని నీటిని పూర్తిగా పారబోయాలని సూచించారు. కేవలం ఐదు నుంచి ఏడు రోజుల పాటు నిల్వ ఉన్న నీటిలోనే దోమల లార్వా వేగంగా అభివృద్ధి చెందుతుందని, అందువల్ల వారానికి ఒకసారి నీటి నిల్వలను తొలగించడం ద్వారా దోమల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు.
అవగాహన కార్యక్రమంలో భాగంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తూ, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా దోమల వ్యాప్తిని శాశ్వతంగా నియంత్రించవచ్చని వివరించారు. పరిశుభ్రమైన పరిసరాలు, ప్రజల అప్రమత్తత, నగరపాలక సంస్థ చర్యలు కలిసివస్తేనే దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను పూర్తిగా నియంత్రించగలమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ (ఇన్చార్జ్) గోపాల్ నాయక్, జోనల్ కమిషనర్–II కె. ప్రభుదాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ బి. కోటేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా విభాగం సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News