విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో అగ్నిప్రమాదాల నివారణ, ప్రజల్లో అగ్ని భద్రతపై అవగాహన పెంపొందించేందుకు శుక్రవారం ఉదయం గాంధీజీ మహిళా కళాశాలలో విఎంసి ఆర్ ఎఫ్ ఓ రత్నబాబు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులకు అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల నిర్వహణ, వాటి వినియోగ విధానం, అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన భద్రతా చర్యలపై అధికారులు వివరంగా అవగాహన కల్పించారు.
అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రారంభ దశలోనే మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లను ఎలా ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్లు, స్మోక్ డిటెక్టర్లు వంటి భద్రతా పరికరాలను ఏయే ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి, వాటి నిర్వహణ ఎలా ఉండాలి, స్మోక్ అలారం వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే అంశాలను ప్రత్యక్షంగా వివరించారు. అలాగే భవనం చుట్టూ అత్యవసర నిష్క్రమణ మార్గాలు (ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు), ఫైర్ సేఫ్టీ సైన్‌బోర్డులు, విద్యుత్ వైరింగ్ నిర్వహణ, అగ్నిమాపక పరికరాల అందుబాటు వంటి అంశాలపై ప్రత్యేకంగా సూచనలు చేశారు.
ప్రతి విద్యాసంస్థలో అగ్ని భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు, అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనలకు గురికాకుండా సురక్షితంగా బయటకు వెళ్లే విధానంపై తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, వీఎంసీ ఫైర్ విభాగం సిబ్బంది, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News