-ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన “ప్రజా దర్బార్ (PGRS)” కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలను స్వీకరించి, సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత విశ్వసనీయ వేదికగా మారిందన్నారు. గత ఏడాదిన్నర కాలంగా వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు పంపించి, వీలైనంత త్వరగా పరిష్కారం చూపామని తెలిపారు. పరిష్కారం ఆలస్యమయ్యే సమస్యల విషయంలో కూడా ప్రజలకు పూర్తి సమాచారం అందిస్తూ ఎమ్మెల్యే కార్యాలయం జవాబుదారీతనంతో పనిచేస్తోందన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటివరకు రూ.12 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు అందించామని తెలిపారు. అనారోగ్యం, ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోందన్నారు.
“పదవి అనేది అలంకారం కాదు… బాధ్యత” అనే భావనతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నామని చెప్పారు.
చదువుతున్న విద్యార్థుల తల్లులకు శుభవార్త చెబుతూ, ‘తల్లికి వందనం’ పథకం కింద ఈ నెలలోనే నిధులు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలన్నదే, ప్రతి తల్లి ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ తమకు గుర్తుందని, ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంత ఆలస్యం జరిగినా ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మరింత బాధ్యతతో పనిచేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ:- విజయవాడ నగరంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అత్యంత వేగంగా ప్రజలకు చేరవేస్తున్న ఘనత ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు దేనని ప్రశంసించారు.
ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం 6 గంటలకల్లా రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ అయ్యేలా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. విజయవాడలోనే అత్యంత బలమైన పార్టీ క్యాడర్ సెంట్రల్ నియోజకవర్గంలో ఉందని, కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ వారికి అన్నలా అండగా నిలుస్తున్న నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు ని కొనియాడారు.
ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఈ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం అందిస్తే తమ సమస్యకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని, ఇదే స్ఫూర్తితో ఎంపీ, ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని అన్నారు.
Prajavartha Online Telugu News