-కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే ‘గొడ్డలి పార్టీ’నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారు
-2020లో జీవో నెంబర్ 11 ద్వారా బీచ్ షాక్స్ పాలసీని తీసుకొచ్చింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే
-లిక్కర్ స్కాములు, కల్తీ మద్యం దందాల వెనుక ఉన్న అసలైన డాన్ జగన్ మోహన్ రెడ్డే
-వైసీపీకి భవిష్యత్తులోనూ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు.. ముందు మీ పాలసీ ఏంటో ప్రజలకు చెప్పండి
-ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంటే, ప్రతిపక్ష ‘గొడ్డలి పార్టీ’ నాయకులు మాత్రం ప్రతిదానికీ అడ్డంకులు సృష్టిస్తూ వికృత రాజకీయం చేస్తున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ తీరును, వారి ద్వంద్వ విధానాలను ఎండగట్టారు. ఒకపక్క రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, భారీగా పెట్టుబడులు తీసుకురావాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండేలా అన్ని రంగాలను అభివృద్ది చేయాలని కూటమి ప్రభుత్వం రేయింబవళ్లు కష్టపడుతోంది. కానీ, వైసీపీ నాయకులకు మాత్రం దేనికీ మద్దతు ఇవ్వడం చేతకాదు. దేనికైనా సరే గొడవ చేయడం, వంకలు పెట్టడమే వాళ్ల డ్యూటీగా పెట్టుకున్నారు. అసలు వాళ్లకి ఏం కావాలో, ఏం వద్దో వాళ్లకే స్పష్టత లేదు. గతంలో అమరావతి రాజధాని పనికిరాదన్నారు. ఇప్పుడు నిరుద్యోగుల కోసం డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తే.. ఆ ఉద్యోగాలు కరెక్ట్ కాదంటూ కోర్టులకెళ్లి ఆపాలని చూస్తున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి లోకేష్ గారు దేశవిదేశాలు తిరిగి రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకువస్తుంటే.. ఆ పెట్టుబడులు రావడానికి వీల్లేదంటూ ఈ గొడ్డలి పార్టీ నాయకులు మెయిళ్లు రాస్తూ అడ్డుపడుతున్నారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ రావద్దు, రాయలసీమలో కొత్త కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు రావద్దు అంటూ ప్రజలకు మంచి జరిగే ప్రతి విషయాన్నీ నాశనం చేయాలని చూస్తున్నారు. మొన్నటికి మొన్న ఈ పార్టీ నాయకులు రోడ్ల మీదకు వచ్చి బీచ్ షాక్స్ పెడుతున్నారంటూ నానా గొడవ చేశారు. నేను జగన్ మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా.. అసలు ఈ బీచ్ షాక్స్ విధానానికి జీవో ఇచ్చింది ఎవరు? మీ ప్రభుత్వం కాదా? తేదీ 28-12-2020 నాడు టూరిజం డెవలప్మెంట్ పాలసీ తెచ్చింది మీరు కాదా? ఆ రోజు జీవో ఎంఎస్ నెంబర్ 11 (G.O.Ms.No. 11) విడుదల చేసింది మీ ప్రభుత్వం కాదా? ఆ జీవోలోని పేజీ నెంబర్ 12లో ఈ బీచ్ షాక్స్ గురించి ప్రపోజల్ పెట్టింది మీరు కాదా అని అడుగుతున్నా. కళ్లు తెరిచి చూసుకోండి. గత ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలను కూటమి ప్రభుత్వం పూర్తిగా సవరించింది. మనకున్న 1052 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో సాధారణ ప్రజలు, కుటుంబాలు ప్రశాంతంగా, ఆనందంగా గడిపే ప్రధాన ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అంతర్జాతీయ పర్యాటకులు వచ్చినప్పుడు వారు సేదతీరడానికి అనువుగా, దూరంగా ఉండే నిర్దేశిత తీర ప్రాంతాలలో మాత్రమే బీచ్ షాక్స్ ఏర్పాటు చేసేలా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చాం. దీన్ని కూడా విమర్శించడం మీ అజ్ఞానానికి నిదర్శనం. జగన్ మోహన్ రెడ్డి గారూ.. మీరు అధికారంలో ఉంటేనేమో అది పరవాన్నం అవుతుంది, మీరు అధికారంలో లేకపోతే అదే పాలసీ తప్పు అయిపోతుందా? ఇదేం పద్ధతి? ఇలాంటి ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని డూండి రాకేష్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి రాజకీయం చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు.
ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కాముల్లో ఉన్న నిందితులంతా జగన్ మోహన్ రెడ్డి తొత్తులేనని డూండి రాకేష్ ఆరోపించారు. మద్యం వ్యాపారంలో ఏ విధంగా కల్తీ చేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారో ఈడీ, సిట్ విచారణల్లో స్పష్టంగా తేలిందన్నారు. కోర్టులు, సీబీఐ, ఈడీ, సిట్ విచారణల ద్వారా కుప్పలు కుప్పలుగా దొరుకుతున్న కాగితాలు, ఆధారాలే ఇందుకు సజీవ సాక్ష్యాలని పేర్కొన్నారు. జగన్ తో సహా ఆయన చుట్టూ ఉన్న వారంతా కల్తీ మద్యంలో వాటాదారులేనని ఆరోపించారు. కల్తీ మద్యం తయారు చేయడానికి బెల్లం అవసరమైతే, సాధారణంగా దొరికే బెల్లం దుకాణాల వ్యాపారస్తులపై సైతం అక్రమంగా కేసులు పెట్టి వేధించారని దుయ్యబట్టారు. ఆ వేధింపులు తట్టుకోలేక కొందరు వ్యాపారులు ప్రాణాలు కూడా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో బెల్లానికి కృత్రిమ కొరత సృష్టించి, ఆ బెల్లాన్ని మొత్తం జగన్ ముఠా చేజిక్కించుకుని కల్తీ మద్యం తయారు చేసి అమ్ముకుందని, ఈ విధంగా కల్తీ లిక్కర్ ద్వారా కోట్ల రూపాయల లంచాలు సేకరించి ప్రజల సొమ్మును మింగేసారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఋషికొండను ఏ విధంగా నాశనం చేశారో ప్రజలంతా చూశారని ఆయన గుర్తు చేశారు. రోజుకు రూ. 2 లక్షల దాకా ఆదాయం వచ్చే ఋషికొండను కూలగొట్టి, ప్రజా ధనంతో నిరుపయోగంగా కొండ మీద ప్యాలెస్ కట్టారు. దాని వల్ల ఈరోజు ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా చేశారని మండిపడ్డారు. తప్పులన్నీ చేసి, ఈరోజు మళ్లీ ఏమీ తెలియనట్టు పత్తి గింజలా వచ్చి బీచ్ షాకుల గురించి మాట్లాడటం చాలా దారుణమని డూండి రాకేష్ దుయ్యబట్టారు. ప్రతిదానికీ వద్దు వద్దు అంటూ అడ్డం పడటం తప్ప అసలు మీకు ఏం కావాలో మీకే తెలియదని ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్సార్‌సీపీకి కనుక నిర్దిష్టమైన పాలసీ ఉంటే, దాని మీద నిలబడే సత్తా ఉంటే.. వెంటనే రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ పర్యాటక, అభివృద్ధి విధానం ఏంటో స్పష్టంగా ప్రకటించాలని ఆయన సూటిగా సవాల్ విసిరారు. వైఎస్సార్‌సీపీ నాయకులారా.. ఈ నెలకు, ఈ సంవత్సరానికే కాదు, రేపు పొద్దున భవిష్యత్తులో కూడా మీరు ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. కనీసం ప్రజలకు ఇచ్చిన హామీలపైన, మీ పాలసీలపైన మీరైనా నిలబడతారా లేదా అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం పోయినా అడ్డగోలుగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరూ ఖాళీగా లేరని హెచ్చరించారు. 2020లో బీచ్ షాక్స్ జీవో తెచ్చింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, నాడు వారు తీసుకున్న నిర్ణయాల్లో అనేక తప్పులు ఉన్నాయన్నారు. ఆ లోపాలన్నింటినీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం సరిదిద్దిందని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు, కుటుంబ సమేతంగా బీచ్‌లకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారికి చాలా దూరంగా ఈ బీచ్ షాక్స్ ఉండేలా పటిష్టమైన నిబంధనలు రూపొందించామని తెలిపారు. బీచ్ షాక్స్ నిర్వహణలో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందని డూండి రాకేష్ వివరించారు. అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా పటిష్టమైన సెక్యూరిటీ, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి, అన్ని రకాల జాగ్రత్తలతో పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే ఏ మంచి కార్యక్రమమైనా సరే, దాన్ని చెడగొట్టాలనే గొడ్డలి పార్టీ వినాశకర విధానం కరెక్ట్ కాదని హితవు పలికారు. జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని డిమాండ్ చేశారు. “మీరు తెచ్చిన విధానాలను మీరే మర్చిపోతూ, రోజుకో మాట మాట్లాడుతున్నారు. అసలు మీ విధానాలు ఏంటో, ఏ రోజు ఏ స్టాండ్ మీద ఉంటారో ముందు ప్రజలకు చెప్పి, ఆ తర్వాత కూటమి ప్రభుత్వంపై మాట్లాడాలని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News