విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సర్కిల్–1 పరిధిలో కలర హాస్పిటల్ వద్ద, సర్కిల్–2 పరిధిలో అక్టప్ స్కూల్‌లో, సర్కిల్–3 పరిధిలో పటమటలోని గోవిందరాజుల స్కూల్‌లో కార్యక్రమాలు నిర్వహించారు. పటమటలోని గోవిందరాజుల స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు స్వచ్ఛతను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఇళ్లలో, కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో, వాణిజ్య ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే వ్యర్థాలను బాధ్యతగా నిర్వహించాలని, చెత్తను రోడ్లపై, కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా నగరపాలక సంస్థ సూచించిన విధానంలో పారవేయాలని తెలిపారు. ప్రజలు తడి, పొడి వ్యర్థాలను మూలం వద్దనే వేరు చేసి అందించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని గద్దె రామ్మోహన్ సూచించారు. ఇంటి పరిసరాలు, రహదారులు, కాలువలు, పార్కులు, చెరువులు తదితర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధుల నివారణతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చని అన్నారు. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు సమష్టిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత విషయంలో కేవలం కార్యక్రమాల సమయంలోనే కాకుండా ప్రతిరోజూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ఇతరులకు కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రతి పౌరుడు విజయవాడను మరింత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని అన్ని వార్డుల్లో ఇంటింటి సర్వేలు నిర్వహించడంతో పాటు స్వచ్ఛత, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. హోటళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు తదితర సంస్థల వివరాలను సేకరించి నమోదు చేయడం, జియో ట్యాగింగ్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆయా సంస్థల నిర్వాహకులు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, విద్యాసంస్థలు మరియు ఇతర సంబంధిత వర్గాలతో అవగాహన సమావేశాలు నిర్వహించి శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల వేర్పాటు, పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నియంత్రణ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు డాక్టర్ డి. చంద్రశేఖర్ తెలిపారు. నగరంలో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచేందుకు ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మార్కెట్ అసోసియేషన్లు, విద్యాసంస్థలు చురుకుగా భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఇళ్లలో ఉత్పత్తయ్యే తడి వ్యర్థాలను హోమ్ కంపోస్టింగ్ ద్వారా సేంద్రీయ ఎరువుగా మార్చుకోవాలని, వర్షపు నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలను వినియోగించాలని, రహదారులు, కాలువలు, చెరువులు, సరస్సులు, పార్కులు, పర్యాటక ప్రాంతాలు తదితర బహిరంగ ప్రదేశాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన విజయవాడను నిర్మించగలమని డాక్టర్ డి. చంద్రశేఖర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముమ్మినేని వెంకటప్రసాద్, చీఫ్ ఇంజనీర్ పి. సత్యాకుమారి, జోనల్ కమిషనర్లు కె. షమ్మీ, కె. ప్రభుదాస్, ఎన్. శ్రీనివాస్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్‌చార్జ్ డాక్టర్ గోపాల నాయక్, పర్యవేక్షణ ఇంజనీర్ చంద్రశేఖర్, దుష్యంత్, డిప్యూటీ డైరెక్టర్ హర్టికల్చర్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జె. శ్రీనివాస్, గోపాలకృష్ణమూర్తి, రామారావు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సీడీవోలు శ్రీకాంత్, జగదీశ్వరి, ఉమామహేశ్వరరావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News