పీఠికాపురాభివృద్ధిరస్తు

-రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్
-బహిరంగ సభ వేదిక నుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభా వేదికపై రూ.1,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అదే సందర్భంగా మరికొన్ని కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు. పిఠాపురం పట్టణ అభివృద్ధికి సంబంధించి సుమారు రూ.200 కోట్ల విలువైన అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలు, రోడ్ల అభివృద్ధి, అత్యాధునిక బస్టాండ్, ఫిష్ మార్కెట్, రోడ్ ఓవర్ బ్రిడ్జి, ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ తదితర అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ప్రకటించారు.
• విద్యార్థులను ప్రోత్సహిస్తూ…
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  సందర్శించారు. కాకినాడ జిల్లాలో గుర్రపుడెక్కతో తయారు చేసిన అలంకరణ వస్తువుల స్టాల్‌ను పరిశీలించి, వాటి తయారీ విధానం, ఉపాధి అవకాశాల గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పలకరించి అభినందించారు. వేదికపై 32 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. విద్యార్థులు విద్యలో మరింతగా రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
• మత్స్యకారుల భద్రతకు ప్రాధాన్యం
పిఠాపురం నియోజక వర్గంలోని మత్స్యకారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన లైఫ్ జాకెట్లు, సీ సేఫ్టీ కిట్లను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఉప్పాడ-కొత్తపల్లి మండలానికి చెందిన 1,258 మంది మత్స్యకారులకు ఈ సేఫ్టీ కిట్లను అందజేశారు. అలాగే లైవ్ ఫిష్, డ్రై ఫిష్ రవాణాకు వినియోగించే ప్రత్యేక బాక్సులతో కూడిన వాహనాలను పరిశీలించారు. సభా వేదికపై 76 మంది మత్స్యకారులకు డ్రై ఫిష్ యూనిట్లు, 30 మందికి కెనటిక్ హోండాలను, ముగ్గురుకి ఆటోలు అందజేశారు.
• స్వయం సహాయక సంఘాలకు రూ.120 కోట్ల రుణాలు
నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా రూ.120 కోట్ల రుణాల మంజూరుకు సంబంధించిన చెక్కులను అందజేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని 10 మంది లబ్ధిదారులకు నివాస గృహాల క్రమబద్ధీకరణ పట్టాలను పవన్ కళ్యాణ్ అందజేశారు.
• అంధ విద్యార్థిని ఆశ నెరవేర్చిన ఉప ముఖ్యమంత్రివర్యులు
పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన విషయం తెలుసుకున్న స్వాతి అనే అంధ విద్యార్థిని ఆయనను కలిసి, ఒక పాట పాడాలనే ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఆమె కోరికను తెలుసుకున్న పవన్ కళ్యాణ్  స్వాతిని ప్రత్యేకంగా సభా వేదిక వద్దకు పిలిపించి ఆప్యాయంగా పలకరించారు. స్వాతి వేమన శతకంలోని పద్యాన్ని ఆలపించగా పవన్ కళ్యాణ్ ఆసక్తిగా విని, ఆమెను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ, రాజానగరం శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ, కాకినాడ జిల్లా కలెక్టర్  హరేంధిర ప్రసాద్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ శాసన సభ్యులు  పెండెం దొరబాబు, కౌడా ఛైర్మన్ తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *