బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతతో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అమోఘమని రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ తెలిపారు.
పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా (సీమ్యాట్ ) ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయి ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలపై శిక్షణా కార్యక్రమాన్ని బాపట్లలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో శిక్షణ పొందుతున్న ప్రధానోపాధ్యాయులతో వర్చువల్ విధానంలో మంత్రి మాట్లాడి, వారికి పలు సూచనలు చేశారు.
ఉపాధ్యాయులంతా చిత్తశుద్ధితో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు ఖచ్చితంగా సాధించవచ్చని మంత్రి సత్యనారాయణ చెప్పారు. ఉపాధ్యాయులు క్షేమంగా, సంతోషంతో ఉంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించగలరని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మాదేనన్నారు. మంచి సమాజాన్ని నిర్మించడానికి విద్యార్థుల దశ నుంచే చిన్నారుల్లో మార్పు తెస్తున్నామన్నారు. చిన్నారులలో సామాజిక మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చామని ఆయన వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి విద్యార్థుల భవిష్యత్తును పెట్టుబడిగా భావించి నాణ్యమైన, ఉత్తమ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. మన పాఠశాలల్లో చదివిన విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో ఉపాధ్యాయులు పని చేయాలని గౌ.ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి కోరినట్లు గుర్తు చేశారు. ఇందుకోసం పాఠశాలలను పర్యవేక్షించే ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 23వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
సమాజంలో చిరస్థాయిగా నిలిచేవారు తల్లిదండ్రులైతే బావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని మంత్రి ప్రశంసించారు. పాఠశాల బాగుపడాలి, విద్యార్థులు జీవితం బాగుపడాలంటే ప్రధానోపాధ్యాయులే నాయకత్వం వహించాలన్నారు. ఉపాధ్యాయులంతా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుని, పూర్తి పరిపక్వతతో విద్యార్థులను మార్గ నిర్దేశం చేయాలన్నారు. విద్యార్థులలో ఆలోచన రేకెత్తించేలా ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన విద్యార్థులను పోటీ తత్వంలో మేటిగా నిలపాలని, విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన బడి, నాడు-నేడు, జగనన్న గోరుముద్ద, విద్యార్థులంతా సమానమేనని చెప్పేందుకు జగనన్న విద్యాకానుక వంటి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ విద్య విధానం అమలు కోసం ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు పంపిణ చేశామన్నారు. ప్రాథమిక స్థాయిలో స్మార్ట్ టీవీలు, 6 నుంచి ఆపై తరగతుల్లోని ప్రతి తరగతి గదిలో 32 వేల ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ లు ఈనెల 30వ తేదీలోగా ఏర్పాటు చేశామన్నారు.
విద్యాభివృద్ధి కోసం ఏంతో బడ్జెట్ ఖర్చు చేసినట్లు మంత్రి సత్యనారాయణ అన్నారు. ప్రధానోపాధ్యాయులుగా ఎదిగిన మీ అనుభవాలను విద్యాభివవృద్ధికి పంచుకోవాల్సిన గొప్ప గురుతర బాధ్యత ఉందన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బింది పెట్టాలనే దృష్టి ప్రభుత్వానికి లేదని, బోధనేతర పనులు లేకుండా ఉపాధ్యాయులకు జీవో ఇవ్వడం అభినందనీమన్నారు. మారుతున్న కాలానుగుణంగా వ్యవస్థలో వచ్చిన మార్పుల ఆధారంగా శరవేగంతో నవీకరణలతో ముందుకు సాగాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలున్నాయనిన్నారు. ఉపాధ్యాయులు మీ బాధ్యతలను గుర్తెరిగి ప్రభుత్వ విద్యావిధానాలను అవగాహన పరచుకోవాలన్నారు. పాఠశాలల కరెంట్ బిల్లులు ప్రధానోపాధ్యాయులు కట్టాల్సిన అవసరం లేదని, సమగ్ర శిక్షా కార్యాలయం నుంచి కడతామని తెలిపారు. ఎక్కడైనా పాఠశాలలకు కరెంట్ విషయంలో ఇబ్బంది ఎదురైతే స్థానిక జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారన్నారు.
ప్రధానోపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగ పరచుకోవాలని సమగ్ర శిక్షా ఎస్.పి.డి. బి.శ్రీనివాసరావు అన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా శిక్షణను చేపట్టిందన్నారు. అంగన్ వాడీ కార్యకర్తలందరికీ 120 రోజులు శిక్షణ కార్యక్రమంతో సర్టిఫికేట్ కోర్సు, ప్రైమరీ టీచర్లకు 60 రోజుల కోర్సు అందించనున్నామన్నారు. 3-8 వయస్సు వారికి నాణ్యమైన విద్య అందిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందన్నారు. టీచర్స్ లో కెపాసిటీ బిల్డింగ్, నాయకత్వంపై అవగాహన అవసరమన్నారు. 44, 480 పాఠశాలల్లోని మొదటి బ్యాచ్ లో 1,450 మంది సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయి ప్రధానోపాధ్యాయులకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, నాయకత్వ సామర్థ్యాల కోసం లక్షణాలు పెంపొందించడం, స్కూల్ ప్రిన్సిపాల్ పాత్ర, పాఠశాల వాతావరణంలో అభ్యసన సంసిద్ధత, పాఠశాల క్రమశిక్షణ, పునరుద్ధరణ పద్ధతులు, మెరుగైన అభ్యాస పర్యావరణం కోసం విద్యార్థుల భావోద్వేగాలను గుర్తించడం, ఆసక్తికరమైన వినూత్న బోధన, కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు ఐ.ఎ.ఎస్., బాపట్ల జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాషా, జిల్లా సంయుక్త కలెక్టర్ సీహెచ్ శ్రీధర్, సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి, ఆర్జేడీ .ఎస్.సుబ్బారావు, ఆర్డీఓ జి.రవీందర్, బాపట్ల జిల్లా విద్యాశాఖాధికారి పి.వి.జె.రామారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News