-ఫార్మా సంస్థలకు ఈ నైపుణ్య వనరుల కొరత ఉంది
-జిల్లా తలసరి ఆదాయం పెంపు దిశగా చర్యలు తీసుకుంటున్నాం
-ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఏఐ టూల్స్‌పై శిక్షణ
-శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాకుళం జిల్లాలో కెమికల్ ఇంజినీర్లకు విపరీతమైన డిమాండు ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టరు స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఫార్మా రంగంలో జిల్లా వేగంగా అభివృద్ది చెందుతోందని చెప్పారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన తన జిల్లా ప్రగతి గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో ఫార్మా సంస్థల నుంచి కెమికల్ ఇంజినీర్లకు డిమాండు ఎక్కువగా ఉందని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఇప్పటికే కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లోమా కోర్సులు ప్రారంభించామన్నారు. తలసరి ఆదాయంలో శ్రీకాకుళం జిల్లాలో తలసరి ఆదాయం పెంచేదిశగా చర్యలు తీసుకుంటున్నాం. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో తలసరి ఆదాయం రూ.1.85 లక్షలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. జిల్లాలో రైతులు కేవలం వరి పంట మాత్రమే ప్రధానంగా సాగు చేస్తున్నారు, ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా కూడా ప్రోత్సహించనున్నామన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగంలో శ్రీకాకుళం జిల్లాలో ప్రగతి సాధించడానికి ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోబోతున్నట్లు తెలిపారు. జిల్లాలో అరసవల్లి, శ్రీకూర్మం పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఉన్నాయని, పర్యాటకరంగం పరంగా కూడా జిల్లాను అభివృద్ధి చేయనున్నామన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్స్ ఉపయోగించడంపై ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి 200 మంది ఉద్యోగులకు ఈ శిక్షణ అందించనున్నామన్నారు.