-కందుల సాగును ప్రోత్సహిస్తున్నాం
-వెయ్యి ఎకరాల్లో నిమ్మగడ్డి సాగు
-తలసరి ఆదాయం పెంచే దిశగా చర్యలు
-పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పార్వతీపురం మన్యం జిల్లాను డోలీల రహిత జిల్లాగా మార్చడానికి ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరు శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన తన జిల్లా ప్రగతిపైన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. జిల్లాలో గిరిజనం ఎక్కువగా ఉన్నారని, కొండ ప్రాంతాల్లో రహదారి సదుపాయం లేకు డోలీలు ఉపయోగిస్తున్నారని, ఆ పరిస్థితి కనిపించకుండా ఉండేలా రహదారి సదుపాయం కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. 250 మంది ప్రజలున్న ఆవాసాలకు కూడా రహదారి సదుపాయం కల్పించాలనే దిశగా ప్రణాళికలు రూపొందించామన్నారు. అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని అలాగే మన్యం ప్రాంతంలో జీడిపప్పు సాగును ప్రోత్సహించి ఇక్కడి జీడికి కూడా బ్రాండ్ ఇమేజ్ వచ్చేలా చేస్తామన్నారు. అపరాల సాగును కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో అనీమియా ఎక్కువగా ఉందని దాన్ని కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కంటైనర్లలో హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జిల్లా తలసరి ఆదాయం రూ.1.67లక్షలుగా ఉందని దాన్ని వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1.94 లక్షలకు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా ప్రగతికి పర్యాటరంగం ఎంతో దోహదపడుతుందని, పర్యాటక రంగంలో జిల్లాను అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రచించామన్నారు. జిల్లాలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణ పనులు 60శాతం పూర్తి కావచ్చాయని తెలిపారు
Prajavartha Online Telugu News