-పరీక్షల సామర్ధ్యాన్ని పెంచాలని కృష్ణబాబు ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కొవిడ్ పరీక్షల సామర్ధ్యాన్ని పెంచాలని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సంబంధిత అధికారుల్ని నేడు ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో తక్కువ స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని, జ్వరం వంటి రోగ లక్షణాలతో ప్రభుత్వ సర్వజనాసుపత్రులకు వస్తున్న వారికి నియమాల మేరకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. కొవిడ్ పరీక్షలు చేయడానికి అవసరమయ్యే విటిఎం(వైరల్ ట్రాన్స్‌మిషన్ మీడియా) కిట్లు, ఆర్ ఎన్ఎ ఎక్సాట్రాక్షన్ కిట్లు మరియు ఆర్‌టిపిసిఆర్ కిట్ల లభ్యతపై కృష్ణబాబు వాకబు చేశారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తిపై వెలగపూడిలోని ఏపి సచివాలయంలో ఆయన సోమవారం నాడు సమీక్షించారు. పరిస్థితిని బట్టి కొవిడ్ పరీక్షలు పెంచే దిశగా రోజుకు వెయ్యి మందికి పరీక్షలు చేసేందుకు తగు చర్యల్ని చేపట్టాలని కృష్ణబాబు ఆదేశించారు. పాత జీజీహెచ్ లలో రోజుకు 100 చొప్పున, కొత్త జీజీహెచ్ లలో రోజుకు 50 చొప్పున పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ మేరకు నెల రోజులకు అవసరమయ్యే కిట్లను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. వివిధ జీజీహెచ్ లలో ఉన్న విఆర్‌డియల్ పరీక్షా శాలలు, ఆక్సిజన్ ప్లాంట్లను అవసరాల మేరకు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యల్ని తీసుకోవాలని కృష్ణబాబు సూచించారు. ఈ సమావేశంలో వివిధ రకాల పరీక్షా కిట్లు, పిపిఇ (పర్సనల్ ప్రొటక్షన్ ఎక్విప్‌మెంట్), మందులు, వెంటిలేటర్లు మరియు ఎన్95 మాస్కుల లభ్యతను సమీక్షించారు. ప్రస్తుతం 2 లక్షలకు పైగా అందుబాటులో ఉన్న పిపిఇ కిట్లు, 60 వేలకు పైగా అందుబాటులో ఉన్న విటిఎం కిట్లను అవసరాల మేరకు వివిధ జీజీహెచ్ లకు అందజేయాలని ఆయన సూచించారు.
వివిధ రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాప్తి, రోజువారీ పరీక్షల తీరును నిశితంగా గమనించాలని, రాష్ట్రంలో గత పది రోజులుగా బయటపడ్డ కొవిడ్ కేసుల వైనాన్ని విశ్లేషించాలని ఆయన ఆదేశించారు. సంబంధిత విభాగాలు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎటువంటి పరిస్థితినైనా సమర్ధవంతంగా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని ఆయన ఆన్నారు. ప్రస్తుత తరుణంలో జీజీహెచ్ లలో అవసరాల మేరకు కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని, పరిస్థితిని బట్టి ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో ఈ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కృష్ణ బాబు తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్రీ జి.వీరపాండియన్, ఎపిఎంఎస్ ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ వి.గిరీశ, డిఎంఇ డాక్టర్ నరసింహం, డియస్‌హెచ్ డాక్టర్ ఎ.సిరి, డిపి హెచ్ డాక్టర్ పద్మావతి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News