Breaking News

ఆంధ్రప్రదేశ్‌ సాగునీటి రంగంపై మేధోమథనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల రంగం, నదీ జలాల సమస్యలు, నిర్మాణంలో ఉన్న భారీ – మధ్య తరహా ప్రాజెక్టులు మరియు వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులు, ప్రతిపాదనలో ఉన్న గోదావరి – బనకచెర్ల ఎత్తిపోతల పథకం మంచి – చెడు, చిన్ననీటి పారుదల వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై నిశితంగా పరిశీలన చేసి, నిర్ధిష్టమైన అవగాహనతో తమ అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలన్న సదుద్దేశంతో ఆలోచనాపరులు – సామాజిక ఉద్యమకారుల సమావేశం విజయవాడలో జూన్‌ 2 (సోమవారం)
ఉదయం 10 గం॥ల నుండి సాయంత్రం 5 గం॥ల వరకు జరిగింది. సమావేశానికి రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్‌ అధ్యక్షత వహించారు.
హాజరైన ప్రముఖులు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు వడ్డే శోభనాధ్రీశ్వరరావు, ఐపీఎస్‌ విశ్రాంత సీనియర్‌ ఉన్నతాధికారి ఎ.బి. వెంకటేశ్వరరావు, ఐఏఎస్‌ విశ్రాంత అధికారి బండ్ల శ్రీనివాస్‌, సాగునీటి రంగానికి చెందిన విశ్రాంత ఇంజనీర్స్‌ శ్రీయుతులు కంభంపాటి పాపారావు, యం.వి. కృష్ణారావు, యం. వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక, సమన్వయకర్త టి. లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై. కేశవరావు, అధ్యక్షులు వి. కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి జమలయ్య, తదితరులు పాల్గొన్నారు.
చర్చ: ప్రముఖ విశ్రాంత ఇంజనీర్‌ కంభంపాటి పాపారావు గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదుల్లో లభించే జలాలు, ట్రిబ్యునల్స్‌ తీర్పులు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, వినియోగంలో ఉన్న ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలపై అంశాల వారిగా సమగ్ర స్వరూపాన్ని సమావేశం ముందుంచారు. కృష్ణారావు, వెంకటేశ్వరరావులు అదనపు సమాచారాన్ని జోడిరచి అర్థవంతమైన చర్చకు అవకాశం కల్పించారు. వడ్డే శోభనాధ్రీశ్వరరావు, ఎ.బి. వెంకటేశ్వరరావు, అక్కినేని భవానీప్రసాద్‌, టి. లక్ష్మీనారాయణ, వై. కేశవరావు, తదితరులు చర్చలో క్రియాశీలకంగా పాల్గొన్నారు.

ప్రభుత్వం ముందుంచడానికి ఏకాభిప్రాయంతో సమావేశం నిర్ధారించిన అంశాలు:
1. నదీ జలాల సమస్య – ముంచుకొస్తున్న ప్రమాదం: ఱ) కృష్ణా నదిలో 75% విశ్వసనీయత ప్రామాణికంగా లభించే జలాల పంపిణీకి సంబంధించి కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌(బచావత్‌ ట్రిబ్యునల్‌)-1 ఇచ్చిన తీర్పును రెండవ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌(బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌) యధాతథంగా ఆమోదించింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ కు న్యాయం చేసింది. అదే సందర్భంలో మిగులు జలాలను కూడా నిర్ధారించి పరివాక ప్రాంతంలోని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసి తీవ్రఅన్యాయం చేసింది. ఆ తీర్పుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేసింది, తీర్పు అమలుపై స్టే విధించబడిరది, విచారణ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి వివాద పరిష్కార బాధ్యతను అదే బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించి బాధ్యత అప్పగించింది. ట్రిబ్యునల్‌ విచారణ పర్యవసానంగా నికర జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ హక్కులకు నేడు ప్రమాదం ముంచుకొచ్చింది. బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ మరియు సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించి, ఆంధ్రప్రదేశ్‌ హక్కులను పరిరక్షించాలి. అలసత్వం ప్రదర్శిస్తే శాశ్వతంగా తీరని నష్టం వాటిల్లుతుందని సమావేశం తీవ్రఆందోళన వ్యక్తం చేసింది.
ఱఱ) గోదావరి నికర జలాల వినియోగానికి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత సమస్యలు తలెత్తిన పూర్వరంగంలో కొత్త ట్రిబ్యునల్‌ ను నియమించడానికి రెండవ అపెక్స్‌ కౌన్సిల్‌ సూత్రప్రాయంగా అంగీకరించింది. ట్రిబ్యునల్‌ ను ఏర్పాటు చేయమని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అత్యవసరం.
ఱఱఱ) వంశధార నదీ జలాల వివాదంపై ట్రిబ్యునల్‌ మన రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఒడిస్సా సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఆ తీర్పుపై స్టే లేకపోయినా అమల్లోకి రాలేదు. నేడు రాజకీయంగా సానుకూల వాతావరణం ఉన్నది. కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో టిడిపి భాగస్వామిగా ఉన్నది. ఒడిస్సా, ఛత్తీఘర్‌ రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌ లో టిడిపి – బిజెపి – జనసేన కూటమి అధికారంలో ఉన్నది. ఈ సానుకూల రాజకీయ వాతావరణంలో ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్నది. వంశధారతో పాటు పొరుగు రాష్ట్రాలతో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణం దృష్టి సారించాలి.
2. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల భవిష్యత్తు: బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ద్వారా కృష్ణా నది మిగులు జలాల వినియోగానికి సంబంధించి సంక్రమించిన స్వేచ్ఛ ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలో తెలుగు గంగ, హంద్రీ – నీవా, గాలేరు – నగరి, ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం వాటికి రక్షణ కల్పించింది. నిర్మాణాన్ని సత్వరం పూర్తిచేసి, నీటి కేటాయింపు సమస్యను పరిష్కరించమని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి, అవసరమైన నిధులను కేటాయించి, యుద్ధప్రాతిపదికన నిర్మాణాలను పూర్తి చేయాలని సమావేశం బలంగా అభిప్రాయపడిరది. హంద్రీ – నీవా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 3850 నుండి 6100 క్యూసెక్కులకు పెంచుతూ ముచ్చుమర్రి నుండి జీడిపల్లి వరకు విస్తరించడానికి 2017లో రు.1030 కోట్ల వ్యయ అంచనాతో పరిపాలనానుమతి ఇచ్చారు. ఆ విస్తరణ పనులు చేయకుండా కాలువ లైనింగ్‌ పనులు చేపట్టారు. ప్రధాన కాలువ వెడల్పు చేసి లైనింగ్‌ పనులు చేపడితే మంచిది. గాలేరు – నగరి రెండవ దశ నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం తీవ్రగర్హనీయం. వెంటనే రెండవ దశను నిర్మించి, గండికోట జలాశయంలో ఉన్న నీటిని పూర్తిగా వినియోగించుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయాలి. అలాగే, నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల కింద ప్రధాన కాలువల నుంచి ఉప కాలువలు, పంట కాలువలు నిర్మించి సాగు భూమికి నీరు అందించిన్నప్పుడే ప్రాజెక్టు నిర్ధేశిత ప్రయోజనాలు సమాజానికి ఒనగూడతాయి.
3. గ్రావిటీ ప్రాజెక్టులకు ఎత్తిపోతల ద్వారా నీరా!: ఱ) శ్రీశైలం కుడి బ్రాంచి కాలువకు 19 టీఎంసీల కృష్ణా నికర జలాల కేటాయింపు ఉన్నది. ఱఱ) తెలుగు గంగకు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కృష్ణా నదిలో సగటు నీటి లభ్యత కింద నిర్ధారించిన నీటి నుండి 25 టీఎంసీలు కేటాయించింది. ఱఱఱ) గాలేరు – నగరి ప్రాజెక్టు 38 టీఎంసీల కృష్ణా మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్నది. ఈ మూడు ప్రాజెక్టులకు శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ – శ్రీశైలం కుడి ప్రధాన కాలువ – బనకచెర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ ద్వారా సహజ ప్రవాహ (గ్రావిటీ) పద్ధతిలో కృష్ణా నది నీటిని అందించడానికి చాలా వరకు ప్రధాన కాలువలు, రిజర్వాయర్లు నిర్మించబడ్డాయి. పంట కాలువల వ్యవస్థను నిర్మించి, నిర్ధేశిత ఆయకట్టుకు నీరందించాలి. అంతే కానీ, వీటికి గోదావరి వరద నీటిని భారీ ఎత్తిపోతల పథకం ద్వారా అందజేస్తామనడం అభ్యంతరకరం, తీవ్రగర్హనీయం. ఈ పథకం కృష్ణా జలాల హక్కులకు ప్రమాదం తెచ్చిపెడుతుంది.
4. పోలవరం – బనకచెర్ల ఎవరి కోసం!: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం – బనకచెర్ల పథకంలో మొదటి భాగమైన పోలవరం నుండి కృష్ణా నదికి నీరు తీసుకువచ్చే ప్రతిపాదనవల్ల ప్రతి సంవత్సరం బుడమేరుకు వరద వచ్చే ప్రమాదం ఉన్నది. దీనిని నివారించడానికి మరియు అంతర్రాష్ట్రవివాదాలకు తావివ్వకుండా పోలవరం నుంచి తలించే గోదావరి వరద నీటిని కృష్ణా నదిలో కలపకుండా కృష్ణా నదిని దాటించి తీసుకువెళ్తే బుడమేరుకు వరద రాకుండా నివారించవచ్చు. అంతేకాక అంతర్రాష్ట్ర సమస్యలను అధిగమించవచ్చు. గోదావరి – కృష్ణా – పెన్నా నదుల అనుసంధాన పథకాన్ని పోలవరం నుండి పోలవరం కుడి కాలువతో సంబంధం లేకుండా ప్రత్యేక కాలువను ‘‘హయ్యర్‌ లెవెల్‌’’లో నిర్మించి, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు – నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టుకు నీటిని అందిస్తూ పులిచింతల దిగువన కృష్ణా నదిని, అటుపై నాగార్జునసాగర్‌ కుడి కాలువను అక్విడెక్ట్స్‌ ద్వారా దాటించి, కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయరుకు చేర్చి, అక్కడ నుంచి వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన రిజర్వాయరు నల్లమలసాగర్‌, సోమశిల, కండలేరు జలాశయాలతో అనుసంధానించేలా పథకాన్ని నిర్మించాలి. కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్‌ కు బచావత్‌ ట్రిబ్యునల్‌ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కల్పించిన హక్కులకు భంగం కలిగించే బొల్లాపల్లి నుండి బనకచెర్ల భాగాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. దీనివల్ల రాయలసీమ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, గాలేరు – నగరి మరియు వినియోగంలో ఉన్న శ్రీశైలం కుడి బ్రాంచి కాలువకు తీవ్రనష్టం వాటిల్లుతుంది.
5. వైకుంఠాపురం ఆవశ్యకత: కృష్ణా నదిపై వైకుంఠాపురం సమీపంలో కనీసం పది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయరును నిర్మించి, పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరుకు దిగువన కృష్ణా నదిలో కలిసే పాలేరు, మున్నేరు ఉపనదుల నీటిని నిల్వ చేసి, కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టు స్థిరీకరణకు వినియోగించాలి. అలాగే జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాలకు సాగునీరు అందించాలి. భవిష్యత్తులో అమరావతి రాజధాని నగరానికి త్రాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది.
6. పోలవరం కుడి కాలువ, గోదావరి – కృష్ణా – పెన్నా నదుల అనుసంధాన పథకం, వైకుంఠాపురం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు ద్వారా కృష్ణా డెల్టా మరియు నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు గోదావరి నీటిని గరిష్టంగా అందించడం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాలను శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అందజేయాలి.
7. పోలవరాన్ని గరిష్ట ఎత్తుతో నిర్మించాలి – గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయాలి: పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు. గోదావరి ట్రిబ్యునల్‌ మరియు కేంద్ర జల సంఘం ఆమోదించిన 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేసి, గరిష్ట స్థాయిలో 194 టీఎంసీ నిల్వ చేసి, 7.20 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు, గోదావరి మరియు కృష్ణా డెల్టాలోని 23 లక్షల ఎకరాల స్థిరీకరణకు, పారిశ్రామిక మరియు త్రాగు నీటి అవసరాల కోసం విశాఖకు 23.5 టీఎంసీలు, 80 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి అందజేయాలి. 960 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. ఈ బహుళ ప్రయోజనాలు వనగూడ్చడానికి వీలుగా పోలవరం ప్రాజెక్టును నిర్మించాలి. ప్రాజెక్టు నిర్వాశితులందరికీ సత్వరం పునరావాస పథకాన్ని అమలు చేయాలి. 41.15 మీటర్ల పరిధిలోని కాంటూరు వరకు పునరావాస పథకంతో 2027 మార్చి నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేంద్ర మంత్రి మండలి తీర్మానం చేసి, ఆ మేరకు నిర్మాణ పనులు పూర్తి చేయడానికి రు.12,156 కోట్లు మంజూరు చేసింది. ఆ ఆదేశాల్లో 45.72 మీటర్ల గరిష్ట ఎత్తుతో పోలవరాన్ని నిర్మించాలన్న మాట ప్రస్తావన లేకపోవడంతో ప్రజల్లో అనుమానాలకు దారితీసింది. వాటిని నివృత్తిచేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణం విస్పష్టమైన ప్రకటన చేయాలి, రెండవ కాంటూరు పరిధిలోని నిర్వాశితులకు పునరావాస పథకాన్ని సత్వరం అమలు చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలి. పోలవరం కుడి, ఎడమ కాలువల కింద నూతన ఆయకట్టుగా ప్రతిపాదించిన 7.20 లక్షల ఎకరాలకు నీరందించడానికి వీలుగా ఉపకాలువలు మరియు పంట కాలువల వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టాలి.
8. పోలవరం ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలి: పోలవరం జలాశయం 32-35 మీటర్ల మధ్య నిల్వ ఉండే నీటిని తరలించడానికి వీలుగా గత ప్రభుత్వం రు.920 కోట్ల వ్యయ అంచనాతో నిర్మించ తలపెట్టిన పోలవరం ఎత్తిపోతల పథకాన్ని కూటమి ప్రభుత్వం తక్షణం రద్దు చేయాలి.
9. ఉత్తరాంధ్రలోని వంశధార ప్రాజెక్టు మొదటి దశలో నిర్మించిన ఎడమ కాలువకు మరమ్మత్తులు చేయకపోవడంతో పూర్తి ఆయకట్టుకు నీరందడం లేదు. రెండవ దశ నిర్మాణాన్ని రెండుగా విడగొట్టారు. అందులో భాగంగా నిర్మించాల్సిన నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిస్సా అభ్యంతరం పెట్టడంతో ఆగిపోయింది. రెండవ దశ, రెండవ ఫేజ్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. తోటపల్లి బ్యారేజి మరియు గజపతినగరం బ్రాంచి కాలువ నిర్మాణం, నాగావళి – వంశధార నదుల అనుసంధాన పథకాన్ని మరియు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న మధ్య తరహా ప్రాజెక్టులకు అవసరమైన నిధులను మంజూరు చేసి రానున్న రెండేళ్ళ కాలంలో పూర్తి చేయాలి. ఎనిమిది లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నిధులు కేటాయించి, నిర్మాణాన్ని వేగవంతం చేయాలి.
10. వినియోగంలో ఉన్న ప్రాజెక్టులు – చిన్న నీటిపారుదల వ్యవస్థకు మరమ్మత్తులు చేయాలి: రాష్ట్ర వ్యాపితంగా వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల రిజర్వాయర్లు, ప్రధాన మరియు పంట కాలువల వ్యవస్థకు అవసరమైన మరమ్మత్తులకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలి. తుంగభద్ర ఎగువ మరియు దిగువ కాలువలు మొదలుకొని వంశధార ప్రాజెక్టు ఎడమ కాలువ వరకు దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల రిజర్వాయర్లు, ప్రధాన కాలువలు, పంట
కాలువల వ్యవస్థల నిర్వహణ – మరమ్మత్తులపై ప్రభుత్వ అలసత్వం పర్యవసానంగా పులిచింతల, గుండ్లకమ్మ, తుంగభద్ర రిజర్వాయర్ల వద్ద గేట్లు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయాయి. విజయవాడను బుడమేరు ముంచేసింది. అలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణను యుద్ధప్రాతిపదికపై అమలు చేయాలి. చిన్ననీటి వనరులైన చెరువులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ అత్యంత శోచనీయంగా ఉన్నది. వాటి మరమ్మత్తులకు మరియు నిర్వహణకు నిధులు మంజూరు చేసి, పనులు చేయాలి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *