-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనగణనలో కులగణన చేపట్టాలని, జనాభా ప్రతిపదికన స్థానిక సంస్థలలో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14వ తేదీన విజయవాడలో సమావేశం నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. మన రాష్ట్రంలో దాదాపు 143 వెనుకబడిన కులాలు ఉన్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులు బిసిలు కోల్పోయారు. ఇటీవల తెలంగాణా ప్రభుత్వం జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేపట్టడం వలన ఏయే కులాలు ఎంతమంది ఉన్నదీ లెక్క తేల్చింది. అందుకనుగుణంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తదుపరి గవర్నర్‌ను కలిసి ఆమోదించాల్సిందిగా కోరడం జరిగింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు బిసిల జపం చేస్తూనే మరోవైపు కులగణనను చేపట్టడానికి ముందుకు రావడం లేదు. కావున ప్రభుత్వంపై ఒత్తిడిపెంచి వెనుకబడిన కులాల హక్కులను సాధించుకోవడానికి, జనగణనలో కులగణన చేపట్టాలని, బిసి కులాల జనాభా ప్రాతిపదికన తెలంగాణా మాదిరిగా స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బిసి కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించి ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ, గాంధీనగర్, హోటల్ ఐలాపురం ప్రక్కనగల శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో ‘‘సమావేశం’’ ఏర్పాటు చేయడం జరిగింది.
Prajavartha Online Telugu News