-స్థిరమైన కొనుగోలు విధానాలపై APCRDA కార్యాచరణ ప్రణాళిక
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతిని పర్యావరణహిత నగరంగా అభివృద్ధి చేసే దిశగా APCRDA మరో కీలక ముందడుగు వేసింది. ఈ కార్యాచరణలో భాగంగా స్థిరమైన & హరిత ప్రొక్యూర్మెంట్ మార్గదర్శకాల ముసాయిదాపై 2026 మే 13న రాయపూడిలో APCRDA ప్రాజెక్టు కార్యాలయంలో ఉన్నత స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ప్రపంచ బ్యాంక్ మద్దతుతో అమరావతిలో అమలవుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగింది. నగర నిర్మాణం & మౌలిక వసతుల అభివృద్ధిలో పర్యావరణ ప్రమాణాలను అమలు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఈ సమావేశానికి APCRDA ఇంజినీర్-ఇన్-చీఫ్ గోపాలకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా, చీఫ్ ఆర్కిటెక్ట్ సందీప్ దీక్షిత్ సమావేశాన్ని సమన్వయం చేశారు. సమావేశంలో ADCL, AGICL ప్రతినిధులు, CII నిపుణులు, గ్రీన్ బిల్డింగ్ కన్సల్టెంట్లు, EDGE కన్సల్టెంట్లు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు పాల్గొన్నారు.
భారతదేశం 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకునే దిశగా తక్కువ కార్బన్ ఉద్గారాలు కలిగిన నిర్మాణ సామగ్రి వినియోగం, వాతావరణ మార్పులకు తట్టుకునే మౌలిక వసతుల నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. సాంప్రదాయంగా తక్కువ ధర ఆధారంగా జరిగే కొనుగోళ్లకు బదులుగా, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని “లైఫ్ సైకిల్ కాస్టింగ్” విధానాన్ని అమలు చేయాలనే అంశాలపై ఈ సమావేశంలో ప్రతిపాదించారు. ఈ విధానంలో నిర్మాణ సామగ్రి కొనుగోలు ధరతో పాటు, నిర్వహణ, వినియోగం, నిర్వహణ ఖర్చులు, రీసైక్లింగ్ అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంటారు.
పర్యావరణహిత నిర్మాణ సామగ్రి వినియోగానికి సంబంధించిన అపోహలను సైతం సమావేశంలో చర్చించారు. గతంలో గ్రీన్ మెటీరియల్స్ ఖర్చు 5 నుంచి 7 శాతం ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం అది సుమారు 1 శాతానికి తగ్గిందని నిపుణులు తెలిపారు. దీర్ఘకాలంలో ఇవి విద్యుత్ & నిర్వహణ ఖర్చులను తగ్గిస్తాయని పేర్కొన్నారు. సిమెంట్, స్టీల్, ఇసుక తదితర నిర్మాణ సామగ్రి వినియోగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలను సమావేశంలో ప్రతిపాదించారు. నిర్మాణ బ్లాకుల్లో కనీసం 30 శాతం ఫ్లై యాష్ లేదా పారిశ్రామిక వ్యర్థాల వినియోగం, 250 – 400 కిలోమీటర్ల పరిధిలో లభించే సామగ్రికి ప్రాధాన్యత, తక్కువ ఉష్ణ ప్రసరణ గల నిర్మాణ సామగ్రి వినియోగం వంటి అంశాలను నిర్దేశిత మార్గదర్శకాల్లో పొందుపరిచారు. అలాగే పర్యావరణ ప్రమాణాలను ధృవీకరించే గ్రీన్ ప్రో వంటి ఎకో లేబుల్స్ వినియోగంపై సైతం దృష్టి సారించారు.
ఈ మార్గదర్శకాల అమలులో భాగంగా మూడు పైలట్ ప్రాజెక్టులను చేపట్టాలని APCRDA నిర్ణయించింది. భవిష్యత్తులో రాష్ట్ర షెడ్యూల్ ఆఫ్ రేట్స్‌లో గ్రీన్ మెటీరియల్స్‌ను చేర్చేందుకు CIIతో కలిసి చర్యలు తీసుకోనున్నట్లు సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలిపారు. స్థిరమైన & పర్యావరణ హిత మౌలిక వసతుల నిర్మాణానికి ఈ చర్యలు దోహదపడతాయని, అమరావతిని సుస్థిర నగరంగా తీర్చిదిద్దడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని సమావేశంలో పాల్గొన్న నిపుణులు వెల్లడించారు.
Prajavartha Online Telugu News