-నగర పారిశుధ్య నిర్వహణలో మరింత వేగం – ఎంపీ కేశినేని శివనాథ్
-అభివృద్ధి పనులతో సెంట్రల్ నియోజకవర్గానికి కొత్త రూపు – ఎమ్మెల్యే బోండా ఉమా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5 జేసీబీ వాహనాలను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు, ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు.
విజయవాడ నగరంలో పారిశుధ్య, డ్రైనేజ్, ఘన వ్యర్థాల నిర్వహణ పనులను మరింత వేగవంతం చేయడానికి 74 హెచ్పీ సామర్థ్యం కలిగిన 5 బ్యాక్హో లోడర్ జేసీబీ వాహనాలను రూ.2.22 కోట్ల వ్యయంతో సమకూర్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో 5 జేసీబీ వాహనాలను ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. గతంలో ఈ ప్రాంత ప్రజలు చెత్త, డ్రైనేజ్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. నేడు ఈ ప్రాంత అభివృద్ధికి ఎమ్మెల్యే ఉమా ప్రధాన కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. డ్రైనేజీలు, రోడ్లు, సుందరీకరణ పనులతో ప్రాంత రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చిన్నచిన్న పనులు కూడా జరగలేదని విమర్శించారు. గ్రేటర్ విజయవాడ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఎంపీ తెలిపారు.
ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ నిరంతరం కేంద్రం నుండి నిధులు తీసుకువస్తూ నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ప్రతి నెల నిర్వహిస్తున్న “స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో ప్రత్యేక దృష్టి సారించడం వల్ల పారిశుధ్య నిర్వహణలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. గతంలో ఈ ప్రాంతం చెత్త చెదారం, దుర్వాసనతో ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేదని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత “చెత్త నుండి సంపద” సృష్టించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎంపీ కేశినేని శివనాథ్ కృషికి నిదర్శనమన్నారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి. సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, పారిశుధ్య విభాగం అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News