– ఈ నెల 1 నుంచి జూన్ 11 వరకు ప్రత్యేక కార్యక్రమాలు
– కౌమార బాలబాలికల సాధికారత దిశగా పయనం
– కెరీర్ గైడెన్స్, నైపుణ్యాభివృద్ధి, సైబర్ భద్రతపైనా అవగాహన కల్పించండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కౌమార దశలోని బాలబాలికల సమగ్ర అభివృద్ధి, భద్రత, ఆత్మవిశ్వాసం, విద్య, ఆరోగ్య అవగాహన తదితరాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో కిశోరి వికాసం ప్రత్యేక వేసవి శిబిరాల కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
గురువారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో కిశోరి వికాసంపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ నెల 1 నుంచి జూన్ 11 వరకు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్యం, విద్య, పోలీస్, నైపుణ్యాభివృద్ధి, యువజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖలు కూడా భాగస్వాములు కావాలని.. కమ్యూనిటీ హాళ్లు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో మంగళ, శుక్రవారాల్లో ఉదయం, సాయంత్రం కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. విద్య ప్రాధాన్యం, సంపూర్ణ ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, మాదకద్రవ్యాల దుర్వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా సైబర్ భద్రత, జీవనోపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక అక్షరాస్యతపైనా జాగృతం చేయాలన్నారు. ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు స్వీయ రక్షణ శిక్షణ, నాయకత్వ లక్షణాల అభివృద్ధి, జీవన నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
సమావేశంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోడల్ అధికారి సాయిగీత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం.రాజేశ్వరరావు, జిల్లా యువజన సంక్షేమ అధికారి డా. కొల్లేటి రమేష్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News