అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీబీఎన్ బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వెల్లువెత్తుతున్నాయని పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖామాత్యులు టి.జి. భరత్ తెలిపారు. ఏపీ సచివాలయంలోని ప్రచార విభాగంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి టిజీ భరత్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా ప్రభుత్వం పెట్టుబడిదారుల ఆకర్షణలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు.పెట్టుబడుల రాకలో దేశంలో 25 శాతం కు పైగా మన రాష్ట్రానికి వస్తున్నాయని, ఇది హర్షనీయమైన విషయమన్నారు. అందుకు అనుగుణంగానే మంత్రివర్గం నిరంతరం పనిచేస్తుందన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు రావటంలో మరియు ఆ పరిశ్రమలు స్థాపన జరగటంలో ప్రత్యేక శ్రద్ధ కనపర్చుతున్నామన్నారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను తరిమికొట్టడంతో మొదట్లో కొంత ఇబ్బంది తలెత్తినా ముఖ్యమంత్రి దిశానిర్ధేశంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామన్నారు. రిలయన్స్ కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో కష్టపడ్డామని తెలిపారు. ఈ రోజు కూడా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ. 3600 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామన్నారు. అయితే ఇది ఓర్వలేని ఒక పార్టీ నాయకులు జోకర్, స్టాండింగ్ కమెడియన్ ల వలే నిరాధార ఆరోపణలు చేస్తూ మా మైండ్ డైవర్ట్ చేయాలన్న కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కోర్టు లో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మా కుటుంబం దశాబ్ధాలుగా రాజకీయంలో ఉందని, ఏ రోజు కూడా ప్రత్యర్ధులు సైతం మాపై అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడ్డారని అనలేదని, అటువంటి చరిత్ర మా కుటుంబానిది అని అన్నారు. ఎన్నికల సమయంలో సైతం ప్రత్యర్థులు తమపై ఇటువంటి ఆరోపణలు చేయలేదని గుర్తు చేశారు.
Prajavartha Online Telugu News