Breaking News

బీజేపీ నేత మాధవ్‌కు అధికారిక ఆహ్వానాలా?

-అధికార కార్యాలయాల్లో సకల మంత్రిగా లోకేశ్ ఫోటోలా ?
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సూటి ప్రశ్న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి, అధికార యంత్రాంగాన్ని తమ రాజకీయ పక్షాల సొంత జాగీరులా వాడుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా ఎలాంటి హోదా లేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను ప్రభుత్వ అధికారిక సమీక్షా సమావేశాలకు ఏ ప్రాతిపదికన ఆహ్వానిస్తున్నారో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీల మధ్య సమన్వయం ఉంటే అది పార్టీ కార్యాలయాలకే పరిమితం కావాలని, కానీ ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో రాజ్యాంగేతర శక్తులకు కుర్చీలు వేసి కూర్చోబెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టు అని విమర్శించారు. ఉన్నతాధికారులు కూడా నిబంధనలను పక్కనబెట్టి, రాజకీయ నేతల అడుగులకు మడుగులు వత్తడం సిగ్గుచేటని, ఇది పరిపాలనా వ్యవస్థ పతనానికి నిదర్శనమన్నారు.
మరోవైపు, రాష్ట్రంలో నారా లోకేశ్ తీరును చూస్తుంటే ఆయన ‘సకల శాఖా చక్రవర్తి’లా వ్యవహరిస్తున్నారని ఈశ్వరయ్య ఎద్దేవా చేశారు. కేవలం తన శాఖలకు పరిమితం కావాల్సిన లోకేశ్ ఫోటోలను రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి వెబ్‌సైట్‌లోనూ సీఎంతో సమానంగా ప్రదర్శించడం వెనుక ఉన్న మతలబు ఏమిటని నిలదీశారు. ఇది ఇతర మంత్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాక, రాజ్యాంగబద్ధంగా కేబినెట్ నిర్వహించే సమిష్టి బాధ్యతను అవమానించడమేనని దుయ్యబట్టారు. తనకు సంబంధం లేని శాఖల ఎంఓయూలలో పాల్గొనడం, ఇతర మంత్రుల అధికార పరిధిలోకి చొరబడటం ద్వారా లోకేశ్ తన పరిధి దాటుతున్నారని, దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం దారుణమని పేర్కొన్నారు. చంద్రబాబు తన పుత్రవాత్సల్యంతో తోటి మంత్రులను డమ్మీలుగా మార్చుతున్నారని, ఇలాంటి పోకడలు గతంలో కూడా విఫలమయ్యాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా, ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ‘సూపర్ సిక్స’ హామీలను గానీ, మేనిఫెస్టోలోని ఇతర వాగ్దానాలను గానీ అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ ‘డైవర్షన్ పాలిటిక్స్’ కు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన అభివృద్ధి శూన్యమైనా, ప్రచార ఆర్భాటాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవాలని, అధికారిక కార్యక్రమాల్లో అనధికార వ్యక్తుల జోక్యాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లోకేశ్ ఫోటోలను కేవలం ఆయన శాఖలకే పరిమితం చేయాలని, లేకపోతే దానికి మూల్యం సంబంధిత అధికారులే వహించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారితే చూస్తూ ఊరుకోబోమని, ప్రజా క్షేత్రంలోనే ఈ అప్రజాస్వామిక విధానాలను ఎండగడతామని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *