– జిల్లాలో ఉత్సాహంగా బడి పిలుస్తోంది కార్యక్రమం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి చిన్నారి విద్యాభ్యాసం ద్వారా ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవాలని, పిల్లలందరూ తప్పనిసరిగా బడిలో చేరేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి జి.కొండూరు మండలం, కుంటముక్కల గ్రామంలో జరిగిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. బడిలో చేరిన చిన్నారులతో ముచ్చటించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీయూపీ, జెడ్పీ ఉన్నతపాఠశాలలను సందర్శించి.. పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఉత్సాహవంతంగా నిర్వహిస్తున్నామని.. పాఠశాల వయసు పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన పాఠశాల వాతావరణం, డిజిటల్ విద్యా సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు వంటి సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సహించేందుకు అవగాహన ర్యాలీలు, ఇంటింటి ప్రచారం ద్వారా తల్లిదండ్రుల్లో విద్యపట్ల చైతన్యం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో విద్యా నాణ్యతకు ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలు నిదర్శనమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కార్యక్రమంలో డీఈవో ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రమేష్ బాబు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News