గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 27న జరగనున్నబక్రీద్ పండుగ సందర్భంగా గుంటూరు నగరంలో గోవధ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ ఛాంబర్ లో ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు టీంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అనధికార జంతు వధ నిషేదమని, బక్రీద్ సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టడం, త్రాగునీరు, షామియానా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నగర పాలకసంస్థ ఏర్పాటు చేసే జంతు వధశాలను మాత్రమే వినియోగించుకోవాలన్నారు. గోవధ నిరోధక చట్టం 1977 మరియు పశు సంరక్షణ చట్టం సెక్షన్ 05 ప్రకారం రాష్ట్రంలో మగ లేదా ఆడ అయినటువంటి ఆవు, దూడలను, చూడి పశువులను, 3 నెలల్లోపు దూడలు కల్గిన పశువులను ఎట్టి పరిస్థితిల్లోను వధించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే బక్రీద్ పండుగ నిర్వహణపై ముస్లిం, హిందూ మత పెద్దలు, గో సంరక్షణ సమితి సభ్యులు, పశు సంవర్ధక శాఖ, పోలీస్, నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. అలాగే జిఎంసి పరిధిలో జిఎంసి ప్రజారోగ్య అధికారులు, ఇతర శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే స్వచ్చ సర్వేక్షన్ బృందాలు పర్యటిస్తున్నాయని, గుంటూరు నగరంలో కూడా త్వరలోనే పరిశీలనకు వస్తారని తెలిపారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ, తడిపొడి వ్యర్ధాలను వేరు వేరుగా సేకరణ నూరు శాతం జరగాలని, పారిశుధ్య పనుల నిర్వహణ పిన్ పాయింట్ ప్రోగ్రాం మేరకు పక్కాగా జరగాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు కార్యదర్శులు తమ పరిధిలో రోడ్ల మీద చెత్త కుప్పలు లేకుండా, ఖాళీ స్థలాల్లో వ్యర్ధాలు వేయకుండా, అంతర్గత డ్రైన్లలో పూడికను పూర్తి స్తాయిలో తొలగించుటకు ప్రత్యేక డ్రైవ్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్లల్లో హోం కంపోస్ట్ తయారీపై వార్డ్ సచివాలయాల వారీగా అవగాహన కల్గించాలన్నారు. రీ సైకిల్, రీయూజ్, రెడ్యూస్ (ఆర్ఆర్ఆర్) పై కూడా అవగాహన కలిగించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు నగరంలో పచ్చదనం పెంపు, జంక్షన్లను అభివృద్ధి చేయాలన్నారు. ఎస్టీపి, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. నగరంలో ప్రధాన రహదారుల్లో వాల్ పెయింట్స్ చేయించాలన్నారు. గుంటూరు నగరాన్నిపోస్టర్ ఫ్రీ సిటీగా ప్రకటించామని, అనధికార బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఫుట్ పాత్ లు, డ్రైన్లు, రోడ్ల ఆక్రమణలు జరగకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కమిషనర్ (ఇంచార్జ్) జి.సాంబశివరావు, డిప్యూటి కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఈఈ సుందరరామిరెడ్డి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అనిల్ కుమార్, ఎస్.ఎస్ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News