-లైడార్ సర్వే ఆధారంగా డెల్టా ప్రక్షాళనకు డిపిఆర్ సిద్ధం చేస్తున్నాం.
-ఈఏడాది కాలువల్లో పూడికతీత పనుల కోసం 397 కోట్లు కేటాయింపు.
-సర్.ఆర్ధర్ కాటన్ జయంతి వేడుకల్లో – మంత్రి నిమ్మల రామానాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాటన్ మహాశయుని ఆశయాలతో రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని అన్నారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శుక్రవారం విజయవాడ జలవనరుల మంత్రి క్యాంపు కార్యాలయంలో సర్.ఆర్దర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఆంగ్లేయుడైనా కాటన్ ముందు చూపుతో ధవళేశ్వరం, కృష్ణా బ్యారేజిలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల నిర్మాణాలు చేసిన మహానుభావుడు అని కొనియాడారు.
గత ఐదేళ్ల జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ శాఖ, విధ్వంశంతో కాటన్ ఆత్మసైతం క్షోభించిందని అన్నారు. విధ్వంశానికి గురైన పోలవరం ప్రాజెక్టుతో పాటు, ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారని, గోదావరి నదిపై కాటన్ ధవళేశ్వరం బ్యారేజి తరువాత మళ్ళీ చంద్రబాబు సారధ్యంలోనే పోలవరం నిర్మాణం అవుతుంది అని తెలిపారు. కాటన్ స్పూర్తితో ధవళేశ్వరం బ్యారేజ్ కు 117 కొత్తగేట్ల ఏర్పాటు కోసం 150.09 కోట్లు కేటాయించాం అని త్వరలోనే పనులు చేపట్టి, గేట్ల అమరిక పనులు పూర్తి చేస్తామని తెలిపారు. గోదావరి డెల్టా ప్రక్షాళన కోసం 14 కోట్లతో లైడార్ సర్వే పూర్తి చేయగా, ఆ సర్వే ఆధారంగా డిపిఆర్ తయారు చేస్తున్నాం అని అన్నారు.
గత వైసిపి ప్రభుత్వంలో రైతులకు సకాలంలో సాగు నీరు కూడా అందించలేదని, వేల కోట్లు పెట్టి నిర్మించిన ప్రాజెక్టులకు, వార్షిక నిర్వహణ లేకపోవడంతో శిధిలావస్ధకు చేరుకున్నాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే 790 కోట్లు కేటాయించి కాలువలు, డ్రైన్లలో తూడు, గుర్రపుడెక్క, పూడిక తీత వంటి పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. రానున్న ఖరీఫ్ సీజన్ నాటికి కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడిక తొలగింపు పనుల కోసం 397 కోట్లు కేటాయించి పనులు చేస్తున్నాం అని తెలిపారు.
Prajavartha Online Telugu News