Breaking News

అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకూడదు : కలెక్టర్ డీకే బాలాజి

-తాడిగడపలో 14 మంది ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష
-నాట్ ట్రేసబుల్, అన్ కలెక్టబుల్, అనామలీస్ ఫారాలపై క్షుణ్ణ పరిశీలన
-ఫారాలను జూలై 20 లేదా 21లోపు సమర్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా పూర్తి చేసి, ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌తో కలిసి పెనమలూరు ఎంపీడీవో కార్యాలయంలో తాడిగడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్ కార్యక్రమం కోసం నియమించిన 14 మంది ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నాట్ ట్రేసబుల్, అన్ కలెక్టబుల్, అనామలీస్ కేటగిరీలకు సంబంధించిన ఫారాల స్థితిగతులు, పురోగతిని సమీక్షించి అధికారులకు అవసరమైన దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఇప్పటికే డిజిటలైజేషన్ పూర్తయిన ఫారాలు, ఇంకా డిజిటలైజేషన్ కాని ఫారాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లు స్వయంగా మొబైల్ యాప్ ద్వారా రాండమ్‌గా వివరాలను పరిశీలించి, సంబంధిత ఓటర్లతో ఫోన్‌లో మాట్లాడి సమాచారాన్ని ధృవీకరించారు. బీఎల్‌వోలు చేపడుతున్న క్షేత్రస్థాయి పరిశీలనపై అధికారులను ప్రశ్నించి, సందేహాలను నివృత్తి చేశారు.

తాడిగడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నియమించిన 14 మంది ప్రత్యేక అధికారులు, బీఎల్‌వో సూపర్వైజర్లు, బీఎల్‌వోల సమన్వయంతో ప్రతి ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం సర్ కార్యక్రమానికి గడువును మరో పది రోజుల పాటు పొడిగించిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తాడిగడప మున్సిపల్ పరిధిలో ఇంకా సేకరించాల్సిన ఎన్యుమరేషన్ ఫారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ బీఎల్‌వో సూపర్వైజర్లు, ఏఈఆర్‌వోలు, జిల్లా యంత్రాంగం నుంచి నియమించిన ప్రత్యేక అధికారులతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పలు సూచనలు అందినట్లు పేర్కొన్నారు.

ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారం అందుకున్న వారు వెంటనే నింపి సంబంధిత బీఎల్‌వోకు అందజేయాలని కోరారు. ఇంకా ఫారం అందని వారు తమ బీఎల్‌వోను సంప్రదించి ఫారం తీసుకుని పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. జూలై 24 వరకు గడువు ఉన్నప్పటికీ చివరి రోజు వరకు వేచి చూడకుండా జూలై 20 లేదా 21లోపు ఫారాలను సమర్పిస్తే డిజిటలైజేషన్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయడానికి వీలవుతుందని తెలిపారు.

సమావేశంలో ఉయ్యూరు ఆర్డీవో ఎస్ కరుణ కుమారి, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, ప్రత్యేక అధికారులు, బీఎల్‌వో సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *