-సీపీఐ నేత నారాయణ , సీనియర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి , “సుజనా ఫౌండేషన్” ద్వారా న్యాయవాదుల ఆరోగ్య రక్షణ కొరకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి నారాయణ, సీనియర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ అన్నారు. బుధవారం, విజయవాడ సివిల్ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరానికి వారు విచ్చేసి వైద్య సేవలను పొందారు.
ఈ సందర్భంగా సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ “సుజనా ఫౌండేషన్” ద్వారా, ఎమ్మెల్యే సుజనా చౌదరి మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు . న్యాయవాదుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ శిబిరాన్ని నిర్వహించడం బాగుందన్నారు.
చలసాని అజయ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు అందించడం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య శిబిరం ఎంతో ఉపయోగపడిందన్నారు. “సుజనా ఫౌండేషన్” ఆంధ్రా హాస్పిటల్స్ అందిస్తున్న వైద్య సేవలను ప్రశంసించారు.
బీ బీ ఏ ప్రెసిడెంట్ వీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ బెజవాడ బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సుజనా చౌదరి,” సుజనా ఫౌండేషన్” ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదులందరు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వీ లక్ష్మీ నారాయణ కోరారు.
ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన ఈ శిబిరంలో 211 మంది న్యాయవాదులకు నిపుణులైన వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు అందించారు. బీ పీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో,ఎక్స్ రే, రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
సుజనా ఫౌండేషన్ సిబ్బంది, ఆంధ్రా హాస్పిటల్స్ వైద్యులు ఈ శిబిరంలో తమ సేవలందించారు. న్యాయవాదులు వీ కిరణ్ కుమార్, పీ ఎస్ ఆర్ ప్రసాద్ బాబు, బీ లెనిన్, శ్రీకాంత్, నరహరిశెట్టి జ్యోతి, సరస్వతి, కొల్లా జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News