-‘ఆధార్ ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ ద్వారా విద్యార్థులకు పారదర్శకంగా లబ్ది
-ఏపీ డిజిటల్ విద్యా సంస్కరణలను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులకు వివరించిన ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు
-‘ట్రాకింగ్ నుండి బయోమెట్రిక్ వరకు.. ఏపీ ‘విద్యార్థి కిట్ల’ పంపిణీ తీరుపై కేంద్రం ప్రశంసలు
-ఏపీ ఆదర్శంగా జాతీయ స్థాయిలో అమలుకు యోచన!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాంకేతికతను మేళవించి, ప్రతి ప్రభుత్వ ప్రయోజనాన్ని అర్హులైన ప్రతి విద్యార్థికి సకాలంలో, అత్యంత పారదర్శకంగా అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష విద్యార్థుల సంక్షేమ పథకాల పంపిణీలో సరికొత్త సాంకేతిక ప్రమాణాలను నెలకొల్పిందని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., అన్నారు.
బుధవారం ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణల అమలు తీరును వివరించారు. ఈ సమావేశంలో ధీరజ్ సాహూ (IAS), అదనపు కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ; యు.పి. సింగ్, డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ; అశ్విని కుమార్, సైంటిస్ట్, ఎన్.ఐ.సి; ప్రవీణ్ కుమార్, రిసోర్స్ పర్సన్, డి.బి.టి (DBT) విభాగం, క్యాబినెట్ సెక్రటేరియట్; బిపిందర్ చంద్ర చమోలి, అండర్ సెక్రటరీ, పి.ఎమ్ (PM SHRI) విభాగం; అన్షు సిన్హా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, పి.ఎమ్ విభాగం; టి.ఎస్.జి, సమగ్ర శిక్ష, పి.ఎమ్ కన్సల్టెంట్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీడీ వివరిస్తూ… ‘‘ఒకే విద్యార్థి – ఒకే ఆధార్’’ అనే నినాదంతో ప్రవేశపెట్టిన “ఆధార్ ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI)” ద్వారానేరుగా చిట్టచివరి లబ్ధిదారుని వరకు(ఎండ్-టు-ఎండ్) పారదర్శక సేవలను అందిస్తోంది. ఒకే ఆధార్ ధృవీకరణ వ్యవస్థను ఉపయోగించి Direct Benefit Transfer) డీబీటీ ద్వారా తల్లికి వందనం నగదు జమ చేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న పీఎంశ్రీ పథకం అమలు, శానిటరీ నాప్‌కిన్స్ పంపిణీ, స్కాలర్‌షిప్‌లు, రవాణా సదుపాయాలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల (CWSN) సహాయక పథకాలు తదితర 8కి పైగా విభిన్న పథకాలను ఒకే డిజిటల్ నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకొచ్చాం’’ అని వివరించారు. తద్వారా నకిలీ లబ్ధిదారులు, రికార్డుల నిర్వహణ లోపాలు, పర్యవేక్షణా లోపాలను అధిగమిస్తూ, పూర్తి డిజిటల్ అథెంటికేషన్ (ధృవీకరణ) వ్యవస్థ విజయంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ అద్భుతం – దేశానికే ఆదర్శం
విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, బ్యాగులతో కూడిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు బయోమెట్రిక్ ఓటీపీ ద్వారా పారదర్శకంగా అందజేసే విధానాన్ని విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుండి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా చూపించారు.
అనంతరం సర్వేపల్లి రాధాకృషన్ విద్యార్థి మిత్ర కిట్లు ‘ట్రాకింగ్ నుండి బయోమెట్రిక్ వరకు అమలయ్యే ప్రణాళికలు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., ఇలా వివరించారు. ‘‘లబ్ధిదారులకు వస్తువులు చేరే ప్రక్రియను సులభతరం చేసేందుకు విద్యాశాఖ ఒక క్రమబద్ధమైన విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా పాఠశాల స్థాయిలో విద్యార్థికి సంబంధించిన పూర్తి కిట్ సిద్ధంగా ఉందని హెడ్‌మాస్టర్ నిర్ధారించిన తర్వాతే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది, అలాగే కిట్ సిద్ధంగా ఉన్నట్లు తల్లిదండ్రుల మొబైల్‌కు ముందుగానే ఎస్ఎంఎస్ (SMS) ద్వారా సమాచారం పంపబడుతుంది. పంపిణీ సమయంలో బయోమెట్రిక్ (వేలిముద్రలు) ద్వారా ధృవీకరిస్తారు, ఒకవేళ వేలిముద్రలు పడనప్పుడు ‘ఆధార్-OTP’ పద్ధతి ద్వారా ప్రక్రియను పూర్తి చేసి, విజయవంతంగా లబ్ధి చేకూరినట్లు డిజిటల్ రసీదు జనరేట్ చేస్తారు, దీనివల్ల వస్తువుల దుర్వినియోగానికి తావుండదు. ఈ మొత్తం సరఫరా వ్యవస్థను పారదర్శకంగా ఉంచేందుకు రియల్-టైమ్ మానిటరింగ్ డ్యాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేశాము, దీని ద్వారా తయారీ కేంద్రం నుండి బ్లాక్ స్టాక్ పాయింట్, స్కూల్ వరకు సరుకు రవాణాను ఇన్-ట్రాన్సిట్ MIS రిపోర్ట్స్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, లారీ డ్రైవర్ వివరాలు, డెలివరీ సమయాన్ని మండల పర్యవేక్షణ బృందం ట్రాక్ చేస్తుంది. ఈ వ్యవస్థలో రాష్ట్ర స్థాయి నిర్వాహకుల నుండి మొదలుకొని జిల్లా కలెక్టర్లు, డీఈఓలు, ఎంఈఓలు, నాణ్యత పరిశీలనా అధికారులు (QCI), పాఠశాల ప్రధానోపాధ్యాయుల వరకు ప్రతి ఒక్కరికీ నిర్దేశిత డ్యాష్‌బోర్డులు కేటాయించబడటం వల్ల ప్రతి స్థాయిలో జవాబుదారీతనం గణనీయంగా పెరిగింది.’’ అని అన్నారు. ఈ విధానాన్ని ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు సూచనలు ఇస్తామని ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రస్తావించారు.
Prajavartha Online Telugu News