Breaking News

డా. కే.ఎల్. రావు కలను పట్టిసీమతో సాకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-నదుల అనుసంధానమే దేశ సుభిక్షతకు మార్గం
-జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ నదుల అనుసంధాన పితామహుడు, ప్రముఖ జలవనరుల నిపుణుడు డా. కె.ఎల్. రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడ ప్రకాశం బ్యారేజి పక్కన ఉన్న ఇరిగేషన్ మోడల్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో కరువు నివారణకు, నీటి వనరుల సమర్థ వినియోగానికి నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని దశాబ్దాల క్రితమే డా. కే.ఎల్. రావు ప్రతిపాదించారని గుర్తు చేశారు. గంగ, మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులను అనుసంధానిస్తూ “గార్లాండ్ ఆఫ్ రివర్స్” అనే మహత్తర భావనను ప్రపంచానికి పరిచయం చేసిన దూరదృష్టి కలిగిన మహానుభావుడు డా. కే.ఎల్. రావు అని కొనియాడారు.

డా. కే.ఎల్. రావు ఆశయాలకు స్ఫూర్తిగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగారని, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసి చరిత్ర సృష్టించారని మంత్రి పేర్కొన్నారు.

ప్రతి ఏటా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి వరద జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి మళ్లించి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేయడంతో పాటు, శ్రీశైలం జలాశయంలో నీటిని నిల్వ చేసి రాయలసీమకు కూడా సాగు, తాగునీటి భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం విజయవంతంగా అడుగులు వేసిందన్నారు. డా. కే.ఎల్. రావు జయంతి రోజున పవిత్ర సంగమం వద్ద గోదావరి వరద జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హారతి ఇచ్చి స్వాగతం పలకడం ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ సందర్భంగా పట్టిసీమ ప్రాజెక్టుపై గతంలో వచ్చిన విమర్శలను ప్రస్తావించిన మంత్రి, ఒకప్పుడు ఈ ప్రాజెక్టును విమర్శించిన వారు నేడు దాని ఫలితాలను చూసి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతాలకు పట్టిసీమ వరప్రదాయినిగా నిలిచిందని స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చిన మంత్రి, డా. కే.ఎల్. రావు తనయుడు విజయ్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని, కూటమి ప్రభుత్వం తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు,ఇరిగేషన్ శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి , కృష్ణా డెల్టా సిఈ రాంబాబు ఇరిగేషన్ ఉన్నత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *