Breaking News

ఆక్వా రంగంపై అసత్య ప్రచారాలు తిప్పికొట్టిన ప్రభుత్వం

-గణాంకాలతో సహా వాస్తవాలను వివరించిన మంత్రి అచ్చెన్నాయుడు

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు.

పెనమలూరు మండలం గంగూరులోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, రాష్ట్ర ఆక్వా కల్చర్ డవలప్మెంట్ అథారిటీ కో వైస్ చైర్మన్ ఆనం వెంకట రమణ రెడ్డి లు మీడియా ప్రతినిధుల సమావేశం లో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో ఆక్వా మరియు అనుబంధ రంగాల ద్వారా కేవలం 41.75 లక్షల కోట్ల జీవీఏ (GVA) ఆదాయం వస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే దానిని 63.65 లక్షల కోట్లకు పెంచిందన్నారు. 2014-19 మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శూన్యం నుంచి ఆక్వా రంగాన్ని 17.74 % వృద్ధి రేటుతో గత ప్రభుత్వానికి అప్పగించారన్నారు. అయితే గత ప్రభుత్వం దానిని పెంచాల్సింది పోయి, 16.7% కి తగ్గించి దివాళా తీయించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మళ్లీ దీనిని 19% వృద్ధి రేటుకు తీసుకువెళ్లిందన్నారు.

గత ప్రభుత్వ కాలంలో గత ముఖ్యమంత్రి ‘అప్సడా’ (APSADA) చట్టం తెచ్చానని, తానే చైర్మన్‌గా ఉన్నానని గొప్పలు చెప్పుకున్నారని. కానీ, ఆయన హయాంలో ఒక్కటంటే ఒక్క రోజు కూడా అప్సడా ఫుల్ బాడీ సమావేశం కూడా నిర్వహించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే మొట్టమొదటి పూర్తిస్థాయి అప్సడా సమావేశం నిర్వహించి, ప్రతి 15 రోజులకు ఒకసారి రైతులు, పరిశ్రమల యాజమాన్యాలతో సమీక్షలు జరుపుతూ ధరల నియంత్రణకు ఒక సిస్టమ్‌ను ఏర్పాటు చేసిందన్నారు.

2019 లో ఫీడ్ ధర కేజీ కేవలం ₹87 మాత్రమే ఉండేదన్నారు. గత ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో రా మెటీరియల్ (సోయాబీన్, ఫిష్ ఆయిల్) ధరలు పెరగకపోయినా, కంపెనీలతో మిలాఖత్ అయి 6 సార్లు ధరలు పెంచి ₹110 కి చేర్చిందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రైతుల భారాన్ని తగ్గిస్తూ తక్షణమే ₹6 తగ్గించిందన్నారు.

ఇటీవల అంతర్జాతీయంగా ఫిష్ ఆయిల్ ధర 91%, సోయాబీన్ ధర 49% పెరిగి, ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితి వస్తే… ముఖ్యమంత్రి 5 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించి సమతుల్యత సాధించారన్నారు. కేంద్ర మంత్రితో మాట్లాడి సోయాబీన్, ఫిష్ ఆయిల్ ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

2014కు ముందు యూనిట్ విద్యుత్ ధర ₹3.80 ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని ₹2.00 కి తగ్గించి ఆక్వా రంగానికి ఊతమిచ్చారన్నారు. గత ప్రభుత్వం పాదయాత్రలో అందరికీ ₹1.50 కే ఇస్తామని గొప్పలు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక ఆక్వా జోన్, 10 ఎకరాల లోపు ఉన్నవారికేనంటూ ఆంక్షలు పెట్టి మెజారిటీ రైతులను మోసం చేసి, కేవలం 68 వేల కనెక్షన్లకు ₹750 కోట్ల సబ్సిడీ మాత్రమే ఇచ్చిందన్నారు.

కూటమి ప్రభుత్వం ఎలాంటి జోన్, నాన్-జోన్ నిబంధనలు లేకుండా, ఎకరాల పరిమితి లేకుండా ఆక్వా రైతులకు రూపాయిన్నర (₹1.50) కే విద్యుత్ అందిస్తూ జీవో జారీ చేసిందన్నారు. ఇందుకోసం ఏడాదికి ₹1175 కోట్లు సబ్సిడీగా కేటాయించిందన్నారు. అదనంగా ₹320 కోట్ల వ్యయంతో 12,500 కొత్త కనెక్షన్లను మంజూరు చేస్తోందన్నారు.

తమ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు 25 KV ట్రాన్స్‌ఫార్మర్ కేవలం ₹67,000 లకే ఇవ్వగా, గత ప్రభుత్వం ఆ ధరను ఏకంగా ₹3,24,000 కి పెంచి రైతుల నడ్డి విరిచిందన్నారు. అలాగే గతంలో ₹3,56,000 గా ఉన్న 100 KV ట్రాన్స్‌ఫార్మర్ ధరను గత ప్రభుత్వం ₹7,03,000 కి పెంచి భారీ దోపిడీకి పాల్పడిందన్నారు.
గత ప్రభుత్వం 375 ల్యాబ్‌లు పెట్టామని ప్రచారం చేసుకుంది, కానీ వాటిల్లో కనీసం ఒక ఇన్‌స్ట్రుమెంట్ గానీ, సిబ్బంది గానీ లేరని కేవలం బోర్డులకే పరిమితమయ్యాయన్నారు. ఫిషరీస్ యూనివర్సిటీ పేరుతో సచివాలయాల్లో క్లాసులు పెట్టి కోడిపిల్లల్లాగా విద్యార్థులను చెల్లాచెదురు చేశారన్నారు. భవనాల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన ₹38 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం ఎగ్గొడితే కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో ఆ నిధులు కేటాయించి బకాయిలు తీర్చి, యూనివర్సిటీని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తోందన్నారు.

అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, ఇరాన్ యుద్ధ ప్రభావం, అమెరికా ఆంక్షలు వంటి క్లిష్టపరిస్థితులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రంగాన్ని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తోందన్నారు. సొంత సిమెంట్ కంపెనీ ధరలను విపరీతంగా పెంచి దోచుకున్న చరిత్ర ఉన్న ప్రతిపక్ష నేతకు, ఆక్వా రంగంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఆక్వా రైతులు వాస్తవాలను గమనించాలని మంత్రి. కె.అచ్చెన్నాయుడు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *