విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధాన డ్రైన్లలో ప్రత్యేక శుభ్రతను చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గురువారం ఉదయం నైజాం గేట్, వన్‌టౌన్‌లోని మేజర్ అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను లాంగ్ ఆర్మ్ ఎక్స్‌కవేటర్ సహాయంతో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ పర్యవేక్షణలో పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు.
ఈ సందర్భంగా అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రధాన డ్రెయిన్లు, కాలువల్లో పేరుకుపోయిన చెత్త, పూడికను ప్రత్యేక యంత్రాల సహాయంతో తొలగిస్తున్నట్లు తెలిపారు. డ్రెయిన్లలో చెత్త పేరుకుపోవడం వల్ల వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి నీటి నిల్వలు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రజలు గృహ వ్యర్థాలు, ప్లాస్టిక్, నిర్మాణ వ్యర్థాలను డ్రెయిన్లు, కాలువల్లో వేయకుండా నగర పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. పారిశుద్ధ్య పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు విజయవాడ నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News