-అన్నమయ్య సంకీర్తనల కళా వైభవం*
-సంగీతం వ్యక్తిత్వ వికాసానికి మార్గం*
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంతటి ఆధునిక సాంకేతిక విప్లవం వచ్చినా, భావితరాలు గ్లోబల్ సిటిజన్స్‌గా మారినా.. మన సంస్కృతి, కళలే మన ఉనికికి ఆధారాలు” అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు డాక్టరు జి.లక్ష్మీశ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, కాకరపర్తి భావనారాయణ కళాశాల, అన్నమాచార్య భావన వాహిని సంయుక్త ఆధ్వర్యంలో డాక్టరు శోభారాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో కేబీఎన్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన అన్నమాచార్య సంకీర్తనల శిక్షణ కార్యక్రమానికి కలెక్టరు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. కేబీఎన్ కళాశాల కార్యదర్శి టి.శ్రీనివాసు అధ్యక్షత వహించారు. అన్నమయ్య వారసత్వ సంపదను ఈ తరానికి అందించడంలో డాక్టరు శోభారాజు ఒక టార్చ్ బేరర్లా నిలిచారని కలెక్టరు కొనియాడారు. ఈరోజు సామాజిక మాద్యమాల్లో రీల్స్, 30 సెకన్ల వీడియోల హడావుడిలో యువత ఆలోచనా శక్తి ఏకాగ్రత హరించుకుపోతున్న తరుణంలో.. సంగీతం అనేది జీవితానికి ఒక అద్భుతమైన శిక్షణ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి ఛైర్పర్సన్ పొడపాటి తేజస్విని పేర్కొన్నారు. సంగీతం కేవలం భక్తికో, పోటీ ప్రపంచంలో గెలవడానికో కాదు, అది మనిషిలో సహనాన్ని, క్రమశిక్షణను పెంచుతుందని స్పష్టం చేశారు. “నది తన నీటిని తాను తాగదు, చెట్టు తన పళ్లను తాను తినదు.. అలాగే శోభారాజు కూడా తన వద్దనున్న అన్నమయ్య సంకీర్తనల జ్ఞానాన్ని నిస్వార్థంగా నవతరానికి పంచుతున్నారు” అని కొనియాడారు. గంగ వద్దకు వెళ్తే పవిత్రమైన గంగాజలం దొరికినట్లే, సంగీతంతో పాటు సంస్కారాన్ని నేర్పించే ఇలాంటి మహానుభావురాలి దగ్గర విద్యను అభ్యసించడం విద్యార్థుల అదృష్టమని, ఇక్కడితో ఆగిపోకుండా ఈ విద్యను పదిమందికీ పంచాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు నేతృత్వంలోని ప్రభుత్వం కళలకు, కళాకారులకు పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. ప్రతి కళాకారుడి ప్రతిభను గుర్తించి, వారికి సరైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పనిచేస్తోందని మాట ఇచ్చారు. అన్నమయ్య పాటను ప్రపంచవ్యాప్తం చేయడమే తన గమ్యమని డాక్టరు శోభారాజు తెలిపారు. యావజ్జీవితం ఆ శ్రీవారి స్వరసేవకే అంకితమన్నారు. ఈ ప్రయాణానికి కావలసిన శక్తి సామర్థ్యాలను ఆ వేంకటేశ్వరుడే తనకు అనుగ్రహించాడని అన్నారు. అందరూ అన్నమయ్య పాటలు పాడుకోవడమే కాకుండా, అందులోని జీవిత పాఠాలను దైనందిన జీవితంలో అనువదించుకుని, ఒక శృతిబద్ధమైన జీవితాన్ని గడపాలి” అని ఆకాంక్షించారు. డాక్టరు శోభారాజు గాత్రం, ఆ పాటలో ఆమె పలికించే భావ రసోత్పత్తి, శుద్ధమైన శృతి, స్వరం వింటుంటే సాక్షాత్తూ ఆ భగవంతుడే భువికి దిగివచ్చినట్లు అనిపించిందని కేబీఎన్ కళాశాల కార్యదర్శి టి.శ్రీనివాసు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేటి తరం పిల్లలకు అన్నమాచార్యుల కీర్తనల విశిష్టత పట్ల అవగాహన కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు ఆర్.మల్లిఖార్జునరావు గీసిన అన్నమయ్య, వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని, కేబీఎన్ కళాశాల అధ్యాపకులు చలపతిరావు రచించిన పద్యభారతి గ్రంథాన్ని అతిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ,
ఎస్కేపీవీవీ హిందూ హైస్కూల్ కమిటీ పరిపాలన అధికారి డాక్టరు వి.నారాయణరావు, కేబీఎన్ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ డాక్టరు కప్పగంతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News