విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
UGSRS స్కాలర్‌షిప్‌లు 500 నుంచి 1000కు.. విలువ రూ.10 వేల నుంచి రూ.30 వేలకు పెంపు
ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్లు 25 నుంచి 200కు.. ఒక్కో గ్రాంట్ రూ.5 లక్షల వరకు డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో జూలై 15, 16 తేదీల్లో జరిగిన పీహెచ్.డి కమిటీ సమావేశంలో పరిశోధన అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి వైస్ ఛాన్సలర్ డా. పులాల చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డా. టి. సాయి సుధీర్, పరిశోధన & అభివృద్ధి డైరెక్టర్ డా. ఎం. లక్ష్మీ సూర్యప్రభ, ప్రచురణల డైరెక్టర్ డా. కె. సుధ పాల్గొన్నారు.
సమావేశంలో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రీసెర్చ్ స్కాలర్‌షిప్ (UGSRS) ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని ఖరారు చేశారు. స్కాలర్‌షిప్‌ల సంఖ్యను 500 నుంచి 1000కు పెంచడంతో పాటు, వాటి విలువను రూ.10 వేల నుంచి రూ.30 వేలకు పెంచారు. అలాగే పరిశోధన వ్యవధిని రెండు నెలల నుంచి ఆరు నెలలకు పొడిగించారు.
అధ్యాపకుల పరిశోధన గ్రాంట్ల సంఖ్యను 25 నుంచి 200కు పెంచగా, ఒక్కో గ్రాంట్‌కు గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ నిధులను పరిశోధన సామగ్రి, ప్రయాణం, ఆకస్మిక ఖర్చులు, నిర్వహణ వ్యయాలకు వినియోగించుకునే అవకాశం కల్పించారు.
అదనంగా పీహెచ్.డి., UGSRS, ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయడంతో పాటు, ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్లు మరియు పీహెచ్.డి ఆరు నెలల పురోగతి నివేదికలను కమిటీ పరిశీలించి ఆమోదించింది.
Prajavartha Online Telugu News