Breaking News

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై మోదీ మౌనం వీడాలి

-నీట్ అక్రమాలకు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలి
-5 లక్షల హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి
-హోంగార్డుల సమస్యలపై కేంద్ర మంత్రి అమిత్‌షాకు, ఎంపీలకు లేఖలు
-కరువు రైతులకు తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలి
-రాజధానిలో రెండోదశ భూసేకరణను నిలిపివేయాలి
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణవేత్త, శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్‌కు భారత కమÖ్యనిస్టు పార్టీ (సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తరఫున రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.
విజయవాడ దాసరి భవన్‌లో ఈ రోజు ఏర్పాటుచేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ గత 20 రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యంత కీలకమైన అంశంపై కనీసం స్పందించకపోవడం అత్యంత దారుణమని, తక్షణమే అక్కడి దీక్షా శిబిరాన్ని సందర్శించి, ఆయనతో చర్చలు జరిపి దీక్షను విరమింపజేయించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని, ఈ అవకతవకల కారణంగా దాదాపు 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడటమే కాకుండా, 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారని ఈశ్వరయ్య తెలిపారు. దేశంలోని విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామిక శక్తులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ అత్యంత కీలకమైన అంశంపై కనీసం స్పందించకుండా దారుణమైన నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. సోనమ్ వాంగ్‌చుక్ ఒక సాధారణ వ్యక్తి కాదని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్యావరణవేత్త, శాస్త్రవేత్త, మేధావి, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత అని ఈశ్వరయ్య పేర్కొన్నారు. లడఖ్ ప్రాంతంలో ప్రజలు తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో తన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వినియోగించి మంచును నీటి వనరుగా మలిచి వేలాది మందికి తాగునీటి సౌకర్యం కల్పించిన గొప్ప శాస్త్రవేత్త సోనమ్ వాంగ్‌చుక్ అని గుర్తుచేశారు. సియాచిన్ వంటి మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న సైనికులు తీవ్రమైన చలిని ఎదుర్కొనే పరిస్థితుల్లో వారికి ఉపయోగపడే ప్రత్యామ్నాయ శాస్త్రీయ పద్ధతులను సూచించి సేవలందించిన వ్యక్తి సోనమ్ వాంగ్‌చుక్ అని అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి నేడు దేశ విద్యా రంగంలో జరుగుతున్న దారుణమైన మోసాలు, నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, విద్యార్థులకు జరిగిన అన్యాయంపై నిరసనగా నిరవధిక నిరాహార దీక్షకు దిగడం దేశవ్యాప్తంగా ప్రజల మనస్సాక్షిని కదిలించిందని, ఆయన పోరాటానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష మద్దతు వెల్లువెత్తుతోందని వివరించారు. అసలు నీట్ ప్రశ్నాపత్రం ఎందుకు లీక్ అయింది? పరీక్షల నిర్వహణలో జరిగిన ఈ ఘోర వైఫల్యానికి కేంద్ర విద్యాశాఖ ఎందుకు బాధ్యత వహించదు? అని ఈశ్వరయ్య ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసాన్ని పొందిన సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రధానమంత్రి మోదీ స్వయంగా సందర్శించి, ఆయనతో చర్చలు జరిపి, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కానీ అలాంటి కనీస చొరవ కూడా చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దేశ ప్రజల్లో మోడీ సర్కార్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. నీట్ అవకతవకలకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే భర్తరఫ్ చేయాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పక్షాన తాము బలంగా డిమాండ్ చేస్తున్నామని ఈశ్వరయ్య స్పష్టంచేశారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సీపీఐ సంపూర్ణ మద్దతును ప్రకటించిందని తెలిపారు.
దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది హోమ్ గార్డులు ఎలాంటి ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ లేకుండా సేవలందిస్తున్నారని, వారి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా హోంగార్డుల సమస్యలను చర్చించి, వారి సేవలకు తగిన గుర్తింపు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. హోంగార్డులను గ్రూప్-సి/గ్రూప్-డి ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, వారి సేవా నిబంధనలను సంస్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పంపిణీ జరిగినప్పటికీ, ఆంధ్రప్రదేశ్`తెలంగాణ మధ్య పనిచేస్తున్న హోంగార్డుల సమస్య మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఈశ్వరయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హోంగార్డులు తెలంగాణలో, తెలంగాణకు చెందిన హోంగార్డులు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తూ కుటుంబాలకు దూరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, డీజీపీలు, ఉన్నతాధికారులకు వందకు పైగా వినతిపత్రాలు, విజ్ఞప్తులు చేసినా పరస్పర బదిలీల (మÖ్యచువల్ ట్రాన్స్‌ఫర్లు) విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. హోంగార్డులకు స్థానికత లేకపోవడంతో వారి పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోతున్నారని, కుటుంబ జీవనం దెబ్బతింటోందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం లేకుండానే పరస్పర బదిలీలు సాధ్యమవుతాయని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. హోంగార్డులు పోలీసు శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, సెలవులు, ఉద్యోగ హక్కులు, సంక్షేమ సౌకర్యాలు లేకుండా 24 గంటల సేవలు అందిస్తున్నారని అన్నారు. పోలీసు శాఖలోని ఈ కనీస స్థాయి సిబ్బంది సమస్యలను హోంమంత్రి అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీపీఐ తరఫున వినతిపత్రం పంపుతున్నామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు ఈ సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరువు తీవ్ర ప్రభావం చూపుతోందని ఈశ్వరయ్య చెప్పారు. రైతులకు తక్షణ సహాయం అందించి, పంట రుణాల పునరుద్ధరణ, కొత్త పంట రుణాల మంజూరు, అవసరమైన ఉపశమన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమరావతి ప్రాంతంలో రెండో దశ భూసేకరణ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఈ విషయాన్ని ఇటీవల జరిగిన తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంతోపాటు గతంలో జరిగిన అనేక సమావేశాల్లో తీర్మానించినట్లు స్పష్టంచేశారు. ఒక మీడియా ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఇప్పటికే దాదాపు 54 వేల ఎకరాల భూమిని సమీకరించిన ప్రభుత్వం, మరో 16 వేల ఎకరాలను సేకరించిందని, మొత్తంగా లక్ష ఎకరాల వరకు రాజధానిని విస్తరించాలనే చంద్రబాబు ఆలోచన సరికాదన్నారు. మÖడు పంటలు పండే సారవంతమైన భూములను కార్పొరేట్ సంస్థలకు చౌకగా అప్పగించే విధానాన్ని అంగీకరించబోమని హెచ్చరించారు. రెండో దశ భూసేకరణను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, రైతుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జగదీష్, తాటిపాక మధు, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *