-న్యూఢిల్లీలో అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI) నిర్వహించిన “ఆల్ ఇండియా చాప్టర్ ఛైర్మన్ల సమావేశం 2026″కు ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరు
-కలిసి పనిచేద్దామని దేశీయ టూర్ ఆపరేటర్లకు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ సాదర ఆహ్వానం
-సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీ టూరిజం పురోగతి:మంత్రి దుర్గేష్
-సింగిల్ విండో విధానం ద్వారా శరవేగంగా పర్యాటక అనుమతులు.. మంత్రి దుర్గేష్ స్పష్టం
-ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. రాజకీయ జోక్యానికి తావుండదు.. టూర్ ఆపరేటర్లకు మంత్రి దుర్గేష్ భరోసా
-పర్యాటక రంగానికి టూర్ ఆపరేటర్లే అసలైన సారథులు: మంత్రి కందుల దుర్గేష్
-కేవలం సందర్శన మాత్రమే కాదు.. ఏపీ సంస్కృతిని పర్యాటకులు అనుభవించేలా ప్యాకేజీలుండాలని సూచన
-రాష్ట్రాన్ని సందర్శించండి, సరికొత్త ప్యాకేజీలను రూపొందించండి, ప్రమోట్ చేయండి. ప్రభుత్వ పక్షాన పూర్తి సహకారం, రాయితీలు అందిస్తామని టూర్ ఆపరేటర్లకు మంత్రి దుర్గేష్ హామీ
-దిగ్విజయంగా ముగిసిన మంత్రి కందుల దుర్గేష్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన.. అనంతరం జైపూర్ పర్యటనకు బయలుదేరిన మంత్రి దుర్గేష్
న్యూఢిల్లీ/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ దేశీయ పర్యాటక రంగ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత కీలకమైన భూమిక పోషిస్తోందని, పర్యాటక రంగాన్ని ఒక వ్యూహాత్మక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం న్యూఢిల్లీలోని చాణక్యపురి ‘హోటల్ జింజర్’ వేదికగా అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI) నిర్వహించిన “ఆల్ ఇండియా చాప్టర్ ఛైర్మన్ల సమావేశం 2026″కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “స్వదేశీ పర్యటన్ – సశక్త్ భారత్” అనే ప్రధాన ఇతివృత్తంతో.. ఆంధ్రప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్‌తో జరిగిన సదస్సు లో మంత్రి దుర్గేష్ కీలక ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, పర్యాటకరంగ సేవల్లో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ADTOI సంస్థకు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 2,400 మందికి పైగా సభ్యులతో విస్తరించిన ఈ జాతీయ నెట్‌వర్క్, భారతీయ పర్యాటక రంగాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం, అరకు లోయ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిలను ఏడు ప్రధాన పర్యాటక హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆధ్యాత్మికం, తీరప్రాంతం (కోస్టల్), పర్యావరణం (ఎకో), బౌద్ధ వారసత్వం, గ్రామీణ సంస్కృతి కలగలిసిన అరుదైన పర్యాటక అనుభూతి ఆంధ్రప్రదేశ్ సొంతమని పేర్కొన్నారు. తిరుపతి, శ్రీశైలం వంటి దివ్యక్షేత్రాల నుండి అరకు లోయ అందాలు, గండికోట గ్రాండ్ కాన్యన్, బెలుం గుహల వరకు ఎన్నో అద్భుతాలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు.
టూర్ ఆపరేటర్లే అసలైన సారథులు:మంత్రి దుర్గేష్
“ప్రభుత్వాలు మౌలిక వసతులను కల్పిస్తాయి కానీ టూర్ ఆపరేటర్లు మాత్రమే పర్యాటక ప్రదేశాలను సందర్శకులకు చేరువ చేసి అద్భుతమైన ప్రయాణ అనుభూతులుగా మారుస్తారు” అని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13, 14 తేదీల్లో జరిగిన ‘ఆంధ్రప్రదేశ్ ADTOI నేషనల్ ట్రావెల్ మార్ట్’ విజయవంతం కావడాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆ భాగస్వామ్యాన్ని వాస్తవ బుకింగ్‌లు, నూతన ప్యాకేజీలుగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.పర్యాటక వృద్ధి కేవలం పర్యాటకుల సంఖ్య పెంచడానికే పరిమితం కాకూడదని, స్థానిక గైడ్‌లు, రవాణాదారులు, హోమ్‌స్టే నిర్వాహకులు, చేనేత కార్మికులు మరియు మహిళా ఉపాధి గ్రూపులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని స్పష్టం చేశారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే స్థానిక సంస్కృతిని పెంపొందించడమే తమ ప్రభుత్వ విధానమన్నారు.
ఈ సందర్భంగా ADTOI సంస్థకు మంత్రి దుర్గేష్ 7 కార్యాచరణ అంశాలు ప్రతిపాదించారు. ప్రతి ప్రధాన ADTOI చాప్టర్ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కనీసం రెండు ప్రత్యేక పర్యాటక సర్క్యూట్‌లను ప్రమోట్ చేయాలని కోరారు. విభిన్న వర్గాల పర్యాటకుల కోసం ఉమ్మడిగా 3, 5, 7 రోజుల ప్యాకేజీలను రూపొందించాలని తెలిపారు. టూర్ ఆపరేటర్ల కోసం త్వరలోనే ప్రత్యేక ఫామిలియరైజేషన్ టూర్లను ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటక సేవల మెరుగుదలకు క్రమబద్ధమైన ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. టూర్ ఆపరేటర్ల డిజిటల్ నెట్‌వర్క్, క్యాటలాగ్‌లలో ఏపీ పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రముఖ పండుగలు, సంస్కృతుల ఆధారంగా సంయుక్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. స్థానిక పర్యాటక సేవా నిర్వాహకులకు సామర్థ్యం పెంపొందించేలా అవసరమైన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
పర్యాటక రంగం కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా గ్రామాలు, తీరప్రాంతాలు, గిరిజన ప్రాంతాల వరకు విస్తరించి మహిళలకు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, స్థానిక వంటకాలు మరియు చేతివృత్తులకు ప్రాచుర్యం తెస్తుందని మంత్రి దుర్గేష్ నొక్కి చెప్పారు. అమరావతి, నాగార్జునకొండ, తొట్లకొండ, బొజ్జన్నకొండ వంటి బౌద్ధ వారసత్వ ప్రదేశాలతో పాటు విజయవాడ, శ్రీకాళహస్తి క్షేత్రాలను, కోనసీమ గ్రామీణ పర్యాటకాన్ని, మారేడుమిల్లి, కోరింగ వంటి పర్యావరణ పర్యాటక కేంద్రాల ప్రాధాన్యతను మంత్రి వివరించారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కలంకారీ కళలు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, ఉప్పాడ-ధర్మవరం చేనేత వస్త్రాలు మరియు అరకు కాఫీ వంటి విశిష్ట ఉత్పత్తులను టూరిజం ప్యాకేజీలలో భాగం చేయాలని కోరారు. పర్యాటకులు ఏపీని కేవలం చూడటమే కాదు… ఇక్కడి సంస్కృతిని అనుభవించేలా చేయాలన్నారు.పర్యాటకులు ఎక్కువ రోజులు బస చేసేలా, ఎక్కువ ఖర్చు పెట్టేలా సరికొత్త హోమ్‌స్టేలు, ఎకో-లాడ్జ్‌లు, కారవాన్ టూరిజం మరియు అడ్వెంచర్ టూరిజం వంటి మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
“ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ఇప్పుడు సరికొత్త అవకాశాలతో, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో పర్యాటకులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న చాప్టర్ ఛైర్మన్లు అందరూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. రాష్ట్రాన్ని సందర్శించండి, సరికొత్త ప్యాకేజీలను రూపొందించండి, ప్రమోట్ చేయండి. మీకు ప్రభుత్వ పక్షాన పూర్తి సహకారం, రాయితీలు అందిస్తాం” అని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు.వాణిజ్యపరంగా లాభదాయకమైనవిగా, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడేవిగా, సంస్కృతిని పెంపొందించేవిగా మరియు స్థానిక సమాజానికి మేలు చేసేవిగా ఉండే అద్భుతమైన ప్రయాణ అనుభూతులను మనం ఉమ్మడిగా సృష్టిద్దామన్నారు.అందరం కలిసి దేశీయ పర్యాటక రంగాన్ని బలోపేతం చేద్దాం, స్థానిక వర్గాలకు ఆర్థిక సాధికారత కల్పిద్దాం. తద్వారా జాతీయ సంకల్పమైన “స్వదేశీ పర్యటన్ – సశక్త్-భారత్” సాకారంలో మన వంతు భాగస్వామ్యం అందిద్దామని మంత్రి కందుల దుర్గేష్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ సమావేశంలో పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ADTOI జాతీయ అధ్యక్షుడు శ్రీ వేద్ ఖన్నా, సంస్థ ముఖ్య ప్రతినిధులు, దేశంలోని వివిధ రాష్ట్రాల చాప్టర్ల ఛైర్మన్లు, పర్యాటక, హోటల్ రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News