-భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరాన్ని అందించవలసిన బాధ్యత మనందరిపై ఉంది.
-పరిసరాలు పరిశుభ్రతలో ప్రతి ఒక్కరికి దినచర్యల్లో ఒక భాగం కావాలి.
-స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చీపురు ని చేతబట్టి పాఠశాల ప్రాంగణాన్ని తుడిచి శుభ్రంచేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి …
ఏలూరు/ ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా “బల్క్ వేస్ట్ జనరేటర్స్ నమోదు, ఘనవ్యర్థాలు నిర్వహణ నియమాలు మరియు పరిశుభ్రత పట్ల అవగాహన” అనే థీమ్ తో కార్యక్రమాన్ని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చీపుర్లను చేతబట్టి, విద్యార్థిని, విద్యార్థులు గ్రామస్తులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని తుడిచి శుభ్రం చేశారు. పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు పరిసరాలు పరిశుభ్రత, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చేతులను దగ్గర ఉండి శుభ్రం చేయించారు. విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. మొక్కలను నాటి, అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర – 2047 సంకల్పంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్జీఓలు, కార్పొరేటు సంస్థలు, విద్యార్థులు, యువత, సేవా సంస్థలు, స్వచ్ఛందంగా పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అందరూ పాల్గొని, మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో జిల్లాలో పాల్గొని, అందరికీ స్ఫూర్తిని నిoపుతున్నారని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే, వ్యాధులు సోకుతాయని, ప్రజలు ఆర్థికంగా నష్టపొవడమే కాకుండా ఆర్థికంగా బలహీనులు అవుతారని అన్నారు. వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. “స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర” కార్యక్రమం కేవలం పరిశుభ్రత కార్యక్రమం మాత్రమే కాదని, ఇది ప్రతి పౌరుడు బాధ్యతగా పాల్గొని రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, అభివృద్ధి దిశగా నడిపించే ప్రజా ఉద్యమం అన్నారు. పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాలు మన ఆరోగ్యానికి, పర్యావరణానికి, భావి తరాలకు అమూల్యమైన సంపద అన్నారు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరీ బాధ్యత అని, మనఇల్లు, మనవీధి, కార్యాలయం, పాఠశాల, ఎక్కడైనా పరిశుభ్రతను పాటించడం ద్వారా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ద గలమని అన్నారు. ప్రజలు సహకారంతో చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేయడం, ప్లాస్టిక్, క్యారీ బ్యాగులను వినియోగాన్ని తగ్గించడం, పచ్చదనాన్ని పెంపొందించడం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను విజయవంతంగా చేస్తే, మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు భాగస్వామ్యం తోడైతేనే ఈ లక్ష్యం సాకారం తప్పక అవుతుందని అన్నారు. మనమంతా కలిసి పనిచేస్తేనే పరిశుభ్రమైన, సుస్థిరమైన, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించగలమని అన్నారు. ప్రతి పౌరుడు ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని, పరిశుభ్రతను మన జీవన విధానంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, వివిధ శాఖలు అధికారులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగు సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News