-ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ జాయింట్ సెక్రటరీ డా. ఐ. శ్రీదేవి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (APSWREIS) ద్వారా నిర్వహించబడుతున్న ప్రతిష్టాత్మక ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COE) కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటిగ్రేటెడ్ ఐఐటీ, జేఈఈ, (IIT-JEE/ NEET) లలో ఉచిత శిక్షణతో కూడిన జూనియర్ ఇంటర్మీడియట్ (1st Year) మరియు సీనియర్ ఇంటర్మీడియట్ (2nd Year) MPC/BiPC కోర్సులలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సొసైటీ జాయింట్ సెక్రటరీ (అకాడమిక్) డా. ఐ. శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని మేఘాద్రిగడ్డ (విశాఖపట్నం జిల్లా), అమరావతి-తాడికొండ (గుంటూరు జిల్లా), మరియు కోట (SPSR నెల్లూరు జిల్లా) లలోని మూడు ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (Co-education) కేంద్రాలలో ఈ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. మార్చి 2026లో జరిగిన 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణులై, కనీసం 85 శాతం, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అర్హులని, అలాగే మార్చి 2026 జూనియర్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 75శాతం మార్కులు సాధించిన విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ కేంద్రాల ద్వారా నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్యతో పాటు ప్రముఖ శిక్షణ సంస్థల అధ్యాపకులచే సమగ్రమైన ఐఐటి, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన కోచింగ్, పూర్తి ఉచిత వసతి, పౌష్టికాహార భోజనం మరియు స్టడీ మెటీరియల్‌ను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మొత్తం సీట్లలో 75శాతం సీట్లు షెడ్యూల్డ్ కులాల (SC) విద్యార్థులకు, మరియు 25శాతం సీట్లు ఇతర వర్గాల (OC, ST, BC) విద్యార్థులకు కేటాయించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్‌పోర్టల్ https://apbragcet.apcfss.in ద్వారా జూలై 17, 2026 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి జూలై 30, 2026 చివరి తేదీ అని తెలియజేశారు. ఇప్పటికే ఇతర జూనియర్ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు కూడా ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, ఎంపికైన పక్షంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లలో ప్రవేశం పొందవచ్చని సూచించారు. అర్హత గల విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డా. ఐ. శ్రీదేవి ఆ ప్రకటనలో కోరారు.
Prajavartha Online Telugu News