Breaking News

ఏపీలో మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు

మ‌హిళా సాధికార‌తే ల‌క్ష్యంగా మంత్రి కొండ‌ప‌ల్లి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌
-SHG మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత
-స్త్రీ నిధి ద్వారా పీఎంఎఫ్‌ఎంఈ పథకం అమ‌లుపై కేంద్ర కార్య‌ద‌ర్శితో మంత్రి కొండ‌ప‌ల్లి చ‌ర్చ‌లు
-స్త్రీ నిధి రుణాల (PMFME) కు వడ్డీ రాయితీ
-జిల్లా సమాఖ్యలను PMFME జిల్లా వనరుల సంస్థగా గుర్తింపుపై సానుకూల స్పందన.
-భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలను ఆహార ప్రాసెసింగ్ రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్త్రీ నిధి మేనేజింగ్ డైరెక్టర్‌తో కలిసి మంగ‌ళ‌వారం న్యూఢిల్లీలో కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoFPI) కార్యదర్శి అవినాష్ ప్రకాశ్ జోషి, సంయుక్త కార్యదర్శి దేవేష్ దేవల్ లతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ఫార్మ‌లైజేష‌న్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంట‌ర్‌ప్రైజెస్ (PMFME) అమలును వేగవంతం చేయడం, మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించే ల‌క్ష్యంతో మంత్రి కొండ‌ప‌ల్లి కొన్ని కీల‌క ప్ర‌తిపాద‌న‌ల‌ను కేంద్ర కార్య‌ద‌ర్శి ముందు ఉంచారు. స్త్రీ నిధి ద్వారా PMFME పథ‌కం అమలుపై కేంద్ర కార్యదర్శితో కీలక చర్చలు జ‌ర‌ప‌డంతో పాటు స్త్రీ నిధి రుణాలతో ఏర్పాటు చేసే పీఎంఎఫ్‌ఎంఈ (PMFME) యూనిట్ల సబ్సిడీ మొత్తాన్ని నేరుగా ‘స్త్రీ నిధి’ ఖాతాకే విడుదల చేయాల‌ని కోరారు. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (AIF) కింద వాణిజ్య బ్యాంకులకు ఇస్తున్న తరహాలోనే పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద స్త్రీ నిధి ద్వారా SHG మహిళలకు అందించే రుణాలకు కూడా వడ్డీ రాయితీ వర్తింపజేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ, మార్గదర్శకత్వం, హ్యాండ్‌హోల్డింగ్ సేవలు అందించేందుకు జిల్లా, మండల సమాఖ్యలను PMFME జిల్లా వనరుల సంస్థలుగా (DROs) గుర్తించాల‌ని మంత్రి చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌పై కేంద్ర కార్యదర్శి అవినాష్ ప్రకాశ్ జోషి, సంయుక్త కార్యదర్శి దేవేష్ దేవల్ సానుకూలంగా స్పందించారు. అలాగే స్త్రీ నిధి ఖాతాకు సబ్సిడీ విడుదల, రుణాలకు వడ్డీ రాయితీ అంశాలను ప్రాధాన్యతతో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
కేంద్ర అధికారులతో చర్చలు విజయవంతం కావడం పట్ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి లభించే ఈ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ SHG మహిళలకు పీఎంఎఫ్‌ఎంఈ పథకం మరింత చేరువవుతుందని, ఆహార ప్రాసెసింగ్ రంగంలో మహిళల ఉపాధి, ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

అల్లూరి సీతారామ‌రాజు భోగాపురం విమానాశ్రయంలో స్వ‌యం బ్రాండ్ స్టాల్‌… కేంద్ర మంత్రి, జీఎంఆర్‌కు విజ్ఞ‌ప్తి
ఆంధ్రప్రదేశ్‌లోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు తయారు చేసే ‘స్వయం’ (SWAYAM) బ్రాండ్ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్ కల్పించే క్ర‌మంలో భోగాపురంలోని అల్లూరి సీతారామ‌రాజు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం ఉత్ప‌త్తుల విక్ర‌యం కోసం ప్ర‌త్యేక స్టాల్ కేటాయించాల‌ని మంత్రి కొండ‌ప‌ల్లి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి మంగ‌ళ‌వారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ని, జీఎంఆర్ (GMR) విమానాశ్రయ యాజమాన్యాన్ని కూడా కలసి రిటైల్ స్టాల్ కేటాయింపుపై చర్చించ‌గా… వారిద్ద‌రు స్టాల్ కేటాయింపున‌కు పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *