Breaking News

ఉపాధికి హార్టికల్చర్ అనుసంధానంతో గ్రామీణ జీవనోపాధికి భరోసా

-పవన్ కళ్యాణ్ చొరవతో రెండేళ్లలో దాదాపు రెండు లక్షల ఎకరాల పండ్ల తోటల సాగు
-లక్ష మందికి పైగా రైతులకు లబ్ది
-‘ఆపరేషన్ చైతన్యం’లో కీలక పాత్ర పోషిస్తోన్న ఉపముఖ్యమంత్రి నిర్ణయం
-అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో గంజాయి వదిలి పండ్ల తోటల సాగుకు మారిన 46 వేల మందికిపైగా గిరిజన రైతులు
-రాయలసీమ జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున పండ్ల తోటల సాగుకు ఊతం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, మౌలిక వసతుల కల్పనకు నిర్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా రైతుల జీవనోపాధి మెరుగుపర్చేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఉపాధి హామీ పథకానికి హార్టికల్చర్ అనుసంధానం ద్వారా గడచిన రెండేళ్లలో దాదాపు రెండు లక్షలకు పైగా ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు ఆయన ఊతం ఇచ్చారు. దాదాపు రూ. 500 కోట్ల ఉపాధి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా లక్ష 10 వేల మందికి పైగా రైతులకి పవన్ కళ్యాణ్ నిర్ణయం మేలు చేసింది. విబి జీ రాం జీ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ప్రజలకు స్థిరమైన జీవనోపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ రెండేళ్ల క్రితమే ఈ సంస్కరణలు తీసుకువచ్చారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండే అల్లూరి, తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండే రాయలసీమ జిల్లాల్లో రైతుల పాలిట ఉపాధి హామీ పథకానికి హార్టికల్చర్ అనుసంధానం వరంగా మారింది.
గడచిన రెండేళ్ల కాలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పండ్ల తోటల సాగు అల్లూరి జిల్లా పరిధిలోని గిరిజన రైతాంగానికి స్థిరమైన ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు తోడ్పాటునిచ్చింది. ఏజెన్సీ ప్రాంతాలను గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు సహకరించింది. గంజాయి సాగును నివారించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ చైతన్యం’లో ఉప ముఖ్యమంత్రి నిర్ణయం కీలక భూమిక పోషించింది. ఉపాధి పథకం ద్వారా చేపట్టిన పండ్ల తోటల సాగును ఒక్క అల్లూరి జిల్లా పరిధిలోనే సుమారు 46 వేల మందికి పైగా రైతులు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిపొందిన రైతుల్లో అత్యధిక శాతం ఈ జిల్లాకి చెందిన వారే కావడం గమనార్హం. అల్లూరి జిల్లా పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సాయంతో రాష్ట్రంలోనే అత్యధికంగా 48 వేలకు పైగా ఎకరాల్లో పండ్ల తోటలు సాగయ్యాయి. అందులో కాఫీ తోటలు కూడా ఉన్నాయి. గిరిజన రైతులకి మొదట సిల్వర్ ఓక్ మొక్కలు అందించి, అవి పెరగడం మొదలైన తర్వాత కాఫీ మొక్కలు పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. సిల్వర్ ఓక్ మొక్కల నీడ కాఫీ తోటల సాగుకి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆ సిల్వర్ ఓక్ మొక్కలను ఆధారంగా చేసుకుని మిరియాలు అంతర పంటగా కూడా సాగు చేస్తారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్య సాధనలోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం కీలక పాత్ర పోషించింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండే అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి నంద్యాల జిల్లాల్లో కలిపి రెండేళ్లలో 62,106 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు ఉపాధి హామీ పథకం ఊతం ఇచ్చింది.
ఈ పథకం కింద పండ్ల మొక్కలు నాటడంతో సరిపుచ్చకుండా, మొక్క చెట్టుగా మారే వరకు దాదాపు మూడేళ్లపాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆర్థిక సాయం అందించనున్నారు. ఏటా దుక్కి దున్నడం, గుంతలు తవ్వడం, భూమిని చదును చేయడం, మొక్కల రవాణా, నాటడం, కంచెలు ఏర్పాటు, నీటిపారుదల సదుపాయాలు, ఎరువుల వినియోగం, అంతర పంటల సాగు వంటి అంశాలకు దశలవారీగా ఆర్థిక మద్దతు అందిస్తున్నారు. హార్టికల్చర్ సాగు ద్వారా రైతులు ఎకరాకి ఏడాదికి రూ. లక్ష ఆదాయం పొందేలా ప్రణాళికలు రూపొందించి, ఆయా ప్రాంతాలను అనువైన మొక్కలు సాగు చేసే ఏర్పాటు చేశారు. రైతు క్షేమమే రాష్ట్ర క్షేమంగా తలంచి పవన్ కళ్యాణ్ తీసుకువచ్చిన సంస్కరణలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *