-స్త్రీనిధికి వడ్డీ సబ్సిడీ, మండల సమాఖ్యల కంప్యూటరీకరణకు ఆర్థిక సహాయం అందించాలని ఎన్‌సీడీసీని కోరిన మంత్రి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (MSME), SERP, ప్రవాసాంధ్రుల సాధికారత మరియు సంబంధాల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ న్యూఢిల్లీలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (National Cooperative Development Corporation – NCDC) మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కుమార్ బన్సాల్, IAS ని మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల పంపిణీ కోసం స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్కు ఎన్‌సీడీసీ అందించిన రూ.4,000 కోట్ల రుణంపై ప్రస్తుతం అమలులో ఉన్న 7.25 శాతం వడ్డీ రేటును తగ్గించాలని మంత్రి కోరారు. వడ్డీ రేటు తగ్గితే స్వయం సహాయక సంఘాల మహిళలకు మరింత తక్కువ వడ్డీతో రుణాలు అందించే అవకాశం కలుగుతుందని ఆయన వివరించారు.
అదేవిధంగా, స్త్రీనిధి ద్వారా అందిస్తున్న రుణాలకు వడ్డీ సబ్సిడీ (Interest Subvention) కూడా కల్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల గ్రామీణ మహిళలకు మరింత తక్కువ వ్యయంతో రుణాలు అందించి వారి జీవనోపాధి కార్యకలాపాలకు బలోపేతం చేయవచ్చని తెలిపారు.
ఇంకా, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (PACS) కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కంప్యూటరీకరణ ఆర్థిక సహాయాన్ని ఆదర్శంగా తీసుకొని, మండల సమాఖ్యల్లో డెస్క్‌టాప్ కంప్యూటర్ల ఏర్పాటు కోసం స్త్రీనిధికి కూడా ఆర్థిక సహాయం అందించాలని మంత్రి కోరారు.
మంత్రి చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ఎన్‌సీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కుమార్ బన్సాల్, IAS, స్త్రీనిధికి ప్రస్తుతం ఉన్న రుణంపై వడ్డీ రేటును సాధ్యమైనంత మేర తగ్గించే అంశాన్ని, వడ్డీ సబ్సిడీ ప్రతిపాదనను, అలాగే మండల సమాఖ్యల కంప్యూటరీకరణకు ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ హరి ప్రసాద్ కూడా మంత్రితో కలిసి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News