Breaking News

పంచదార్ల రెవెన్యూ భూముల తవ్వకాల్లో పర్యావరణ ఉల్లంఘనలపై విచారణకు ఆదేశం

-జాతీయ జలవిజ్ఞాన సంస్థ (NIH) శాస్త్రవేత్తలచే పంచధారల పరిశీలన
-సహజ జలధారల సంరక్షణకు చర్యలు
-పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపిన సంస్థపై పర్యావరణ జరిమానా
-పురాతన ఆలయ పరిరక్షణ మనందరి బాధ్యత
-శ్రీ ఉమా ధర్మలింగేశ్వర ఆలయ సంరక్షణకు పురావస్తు, దేవాదాయ శాఖలు చర్యలు తీసుకోవాలి
-పంచదార్ల కొండ రెవెన్యూ భూముల్లో అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచన
-మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్ మెంట్, ఆపరేషన్స్ అనుమతులు తక్షణం రద్దు చేయాలని ఆదేశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండల పరిధిలోని పంచదార్ల కొండపై రెవెన్యూ భూముల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పంచదార్ల కొండ తవ్వకాల్లో అక్రమాలపై అనకాపల్లి జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, పీసీబీ అధికారుల ప్రాథమిక నివేదికల్లో మైనింగ్ అనుమతులు పొందిన సంస్థ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్న క్రమంలో… పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్, మట్టి తవ్వకాలకు పాల్పడిన సదరు సంస్థపై నిబంధనల మేరకు జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మైనింగ్ కారణంగా పంచదార్ల కొండ దిగువన ఉన్న శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయం, సహజ జలధారల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని సంరక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జలధారల రంగు మార్పుపై జాతీయ జలవిజ్ఞాన సంస్థ (NIH) శాస్త్రవేత్తలను ఆహ్వానించి, ఆ జలధార మూలాలను పరిశీలించి, సహజ ప్రవాహ సంరక్షణకు సంబంధించిన శాస్త్రీయ నివేదికలు తీసుకోవాలన్నారు. సహజ జలధారల సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన సంస్థపై జరిమానాతోపాటు పర్యావరణ పునరుద్ధరణ బాధ్యత కూడా వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే సమయంలో పురాతన ఆలయాలు, ప్రకృతి వనరుల సంరక్షణ బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. పంచదార్ల కొండ వద్ద ఉన్న శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణకు పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ సంయుక్త కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించారు. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పంచదార్ల కొండ పరిసరాలను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచించారు. సదరు మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్ మెంట్, ఆపరేషన్స్ అనుమతులు తక్షణమే రద్దు చేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *