-రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి.
-సాగు నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి.
-గోదావరి,కావేరి నదుల అనుసంధానంతో తాగు,సాగు నీటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
-నదులు అనుసంధానంతో అద్భుత ఫలితాలు సాధించగలం
-రాష్ట్ర సమాచార,పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారథి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల్ నినో ప్రభావం ఈ ఏడాది అధికంగా ఉంటుంది కావున రైతుల శ్రేయస్సు దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో మంత్రులు,అధికారులు సమన్వయంతో సమస్య నుండి రైతులు గట్టెక్కే విధానాలపై కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర సమాచార,పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 1390 వ (53వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి వెల్లడించారు.క్యాబినేట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సమస్యలపై దిశానిర్ధేశం చేశారని ముఖ్యంగా ఎల్ నినో ప్రభావంతో రైతులు సాంప్రదాయ పంటలు వేయటం వల్ల సకాలంలో సాగు నీరు అందక పోతే నష్టపోతారన్న అభిప్రాయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారని తెలిపారు.ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఆగస్టు తరువాత మరింత తీవ్రంగా ఉండనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు.ఈ ఏడాది సాధారణం కంటే 51 శాతం కంటే ఎక్కువగా వర్షపాతం తగ్గుదల ఉంటుందని,దీంతో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కోనే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కావున రైతులు ఈ ఏడాది నీటి ఎద్దడిని ఎదుర్కొనే ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గుచూపాలని తద్వారా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని సూచించారు.అంతేకాకుండా భూగర్భ జలాలు సైతం అడుగంటే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.బోర్లు వేసి వ్యవసాయం చేద్దాం అనే ఆలోచన ను రైతులు చేయవద్దని కోరారు.దీంతో భూగర్భ జలాలు మరింత అటుగంటే ప్రమాదం పొంచి ఉందని మంత్రి పార్థసారథి అన్నారు.
పోలవరం వద్ద గోదావరి నది ప్రతి ఏడాది ఈ సమయానికి దాదాపు లక్ష క్యూసెక్కుల వరద నీరు ప్రవహించేదని కాని ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడటంతో ఈ ఏడాది కేవలం 35 నుండి 38వేల క్యూసెక్కుల వరద నీరు మాత్రమే ప్రవహిస్తోందని దీంతో గోదావరి,కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సాగు నీరు అందని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.ఒక వేళ మంచి వర్షాలు పడితే మంచిదే కాని ఎల్ నినో ప్రభావం పై రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.గోదావరి, కృష్ణా జలాలతో సాగు చేసే రైతులు ఇప్పటికే 70 శాతం మంది రైతులు నాట్లు వేశారని, కాని ఇప్పటి వరకు నాట్లు వేయని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు.రైతులకు ప్రభుత్వం,వ్యవసాయ శాఖలు అండగా ఉంటాయని,రైతులు కూడా ప్రభుత్వం అందించే సూచనలు,సలహాలు పాటించాలని కోరారు. రైతులను ఆదుకోవడానికి వివిధ రకాల విత్తనాల కిట్లను అందించడానికి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోందన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని,ఎల్ నినో ప్రభావం నుండి బయట పడాలని రైతులకు సూచించారు.తాగునీటి సరఫరాకు ట్యాంకర్ల వినియోగంపై కూడా ప్రభుత్వం సమాలోచన చేస్తుందన్నారు. అలాగే పశుగ్రాసం కొరత రాకుండా మెట్ట పంటల సాగు ఆలోచన చేయలని కోరారు. మన రాష్ట్రంలో 59 శాతం ఆయకట్టు భూమి,41 శాతం వర్షాధార పంట భూములు ఉన్నాయని,ఈ ఏడాది ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. అందుకు అవసరమైన విత్తనాల కిట్లను కూడా వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుందన్నారు.
నదుల అనుసంధానంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సారి ఉద్ఘాటించారని మంత్రి పార్థసారథి తెలిపారు.ఎల్ నినో ప్రభావాలను తగ్గించడానికి జల వనరులను రెగ్యులైజ్ చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి తన ఆలోచనను కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రతిపాదించడం జరిగిందన్నారు.గోదావరి నది, కావేరి నదులు వయా బనకచర్ల అనుసంధానం వల్ల మూడు రాష్ట్రాలకు అధిక ప్రయోజనం కలుగుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం ఎంతో ఉపయుక్తమైనదన్నారు. కర్ణాటక,తమిళనాడు రిజీయన్ లో ఘర్షణ వాతావరణం సైతం తగ్గటమే కాకుండా తమిళనాడు తాగు నీటి సమస్యలకు చెక్ పెట్టవచ్చన్నారు.గోదావరి, కావేరి నదుల అనుసంధానంపై కేంద్రం సానుకూలంగా ఉండటం హర్షనీయమన్నారు. నదుల అనుసంధానం తెలంగాణా,ఏపి,తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని, అంతే కాకుండా ఈ నాలుగు రాష్ట్రాల్లోని రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్ గా నిలవనుందని, ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమానా శ్రయాన్ని ప్రారంభించ నున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు.అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్నారు.
ఈసమావేశంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్.విశ్వనాధన్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News